బంగారు షోరూమ్‌ల ఘరానా దోపిడీ
బంగారం అంటే ఇష్టం లేనివారుండరు. ధగధగా మెరిసే బంగారు ఆభరణాలను ధరించి మురిసిపోతూ ఉంటారు మహిళలు. ఆ ఆశనే ఆయుధంగా మార్చుకుంటున్నారు నగల వ్యాపారులు. తెలుగు రాష్ట్రాలలో స్మగ్లింగ్ నగల విక్రయాలు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. బంపర్ ఆఫర్లు, ఉచిత బహుమతులతో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. దుబాయ్‌లో బంగారు వ్యాపారం చేసే అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు తెలుగు రాష్ట్రాలలో తమ దుకాణాల్ని నిర్వహిస్తున్నాయి. సినీ హీరోయిన్లతో, భారీ సెట్‌లు వేసి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తమ దుకాణంలో తరుగు తక్కువని ఒక బ్రాండ్ ప్రచారం చేసుకుంటే, తమ దగ్గర దొరికినన్ని వెరైటీ నగలు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండవని మరొకరు ప్రచారం చేసుకుంటున్నారు. తమ వద్ద కొన్న బంగారానికి సరిపడే బరువుగల వెండి ఉచితమని కొందరు ఆఫర్లు కుప్పిస్తుంటే, వజ్రాలు కొంటే ఆ బరువుకు సమానంగా బంగారం ఉచితమని మరొకరు ఆశలు పెడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల బంగారు దుకాణాలలో కోయంబత్తూరు నుండి తెచ్చే నకిలీ బంగారాన్ని ఎక్కువగా అమ్ముతున్నారు. అలాగే దుబాయి మార్కెట్ నుండి కస్టమ్స్, జీఎస్టీలు చెల్లించకుండా దేశంలోకి స్మగుల్డ్ చేస్తున్న బంగారంతో చేసిన ఆభరణాలను కూడా విక్రయిస్తున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ఫైనాన్స్ సంస్థలు కూడా ప్రారంభించిన ఒకటి రెండేళ్లలోనే వేల కోట్లకు పరుగులు పెడుతున్నాయి. వీరు ఎవరు బంగారాన్ని తెచ్చి తాకట్టు పెట్టినా ఎంలాంటి ప్రశ్నలు వెయ్యకుండా ఆ నగను తాకట్టు పెట్టుకుని డబ్బు ఇచ్చేస్తారు. దీనితో ఎక్కువగా ఈ కంపెనీలలో దొంగిలించి తెచ్చిన బంగారం మారకం ఎక్కువగా జరుగుతోంది. దొంగలు బంగారాన్ని వీరివద్ద తాకట్టు పెట్టి, డబ్బు తీసుకెళ్ళిపోతారు. తర్వాత దాన్ని విడిపించుకోరు. ఇలాంటి నగలను ఆ రాత్రికే ప్రధాన కార్యాలయాలకు పంపేస్తారు. తర్వాత దొంగ దొరికినా నగ దొరకదు. ఈ రకమైన వ్యాపారంతో ఈ కంపెనీలు ఏటా వేలకోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల బంగారు వర్తకుల వద్దే దాదాపు నాలుగు లక్షల కోట్ల విలువైన నల్లధనం ఉంటుందని ఓ అంచనా. వీరు తమ ధనాన్ని దుబాయ్, సింగపూర్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో దాచుకుంటారు. ఏకంగా అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధం కలిగి ఉంటారు. ప్రభుత్వాలను , ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు.

ఇతర వ్యాపారాలపై ఎప్పుడూ ఏదో ఒక దాడులు జరుగుతూ ఉంటాయి. కానీ బంగారు నగల దుకాణాలపై ఎందుకో జరగవు. ఐటీ శాఖ కూడా వీరని కన్నెత్తి చూడదు. ఎందుకంటే వీరికి వచ్చే లాభాలు సామాన్యంగా ఉండవు. అధికారులందరినీ ముందే మేనేజ్ చేసేసుకుంటారు. కార్పొరేట్ ఆఫీసులను మించిన స్థాయిలో షోరూమ్‌లను, సిబ్బందిని పెట్టి కోట్ల విలువైన వ్యాపారాన్ని చేస్తుంటారు. పైగా ప్రచారంపైనే కోట్లు వెచ్చిస్తుంటారు. ప్రభుత్వం కూడా వీరికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. నిజానికి నిత్యావసర వస్తువుల కన్నా కూడా జీఎస్టీ బంగారు ఆభరణాలపై తక్కువ. ఈ దుకాణాల లెక్కలు, రికార్డులు ఎప్పుడూ సక్రమంగా ఉండవు. ఈ మధ్య దీపావళి సందర్భంగా ఒక నగల వ్యాపారి తన సిబ్బందికి 15 కోట్ల రూపాయల విలువైన బహుమతులిచ్చాడంచే వారికి వార్షిక లాభాలు ఏ మేరకు ఉంటాయో మనం ఊహించవచ్చు.

