NewsTelangana

నగల దుకాణంలో దోపిడీ.. కాల్పుల్లో ఇద్దరికి గాయాలు

హైదరాబాద్‌లోని ఓ నగల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. ఓ దుకాణ యజమానికి నగలు విక్రయించేందుకు వచ్చిన వారి నుంచి దుండగులు నగలు, డబ్బు దోచుకొని వెళ్లిపోయారు. సినిమా క్రైమ్‌ను తలపించే ఈ ఘటన నాగోల్‌లోని స్నేహపురి కాలనీలో గురువారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు జరిగింది. ఓ పల్సర్‌, యాక్టివా బైక్‌లపై వచ్చిన ముగ్గురు దుండగులు కస్టమర్లలాగా దుకాణంలోకి ప్రవేశించి.. షట్టర్‌ మూసేశారు. దుకాణ యజమానికి బంగారం డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తుల్ని దుండగులు దూరం నుంచే ఫాలో అయినట్లు సీసీ కెమెరా ఫుటేజీలో కనిపించింది. దుండగులు జరిపిన మూడు రౌండ్ల కాల్పుల్లో దుకాణ యజమాని కళ్యాణ్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు.

ఇతర రాష్ట్రాల వాళ్లే..

హెల్మెట్‌ ధరించిన దుండగుల వాహనాలకు నెంబర్‌ ప్లేట్‌ కూడా లేదు. దుండగులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు 15 బృందాలను ఏర్పాటు చేసి దుండగులను గాలిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్‌ టీం పలు ఆధారాలు కూడా సేకరించింది. ఈ దోపిడీ పథకం ప్రకారమే జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.