రేవంత్.. నీ చరిత్ర బయట పెడ్తా
`రేవంత్.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేదంటే మర్యాద దక్కదు. నీ చరిత్ర బయట పెడ్తా. నేను తలచుకుంటే మునుగోడులో అడుగు పెట్టలేవ్` అని టీపీసీసీ అధ్యక్షుడిని మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని, బ్లాక్‌మెయిల్ చేస్తూ.. హైదరాబాద్‌లో వందల కోట్ల రూపాయలు వసూలు చేయలేదా? అని ప్రశ్నించారు. డబ్బులిచ్చి టీపీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. రూ.22 వేల కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముడుపోయానంటూ తనపై చేసిన ఆరోపణలపై రాజగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తానని, మునుగోడు ప్రజలపై తనకు ఆ నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అదే రేవంత్ రెడ్డి పోటీ చేయాలంటే పార్టీ జెండా కావాలని ఎద్దేవా చేశారు. తన మంచితనాన్ని చేతగానితనంగా అనుకోవద్దని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని రేవంత్‌పై రాజగోపాల్ విరుచుకుపడ్డారు.