రాజస్థాన్ కొత్త సీఎం సచిన్ పైలట్? ప్రస్థానం ఇదే..!
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్… అంచలంచెలుగా ఎదిగి సీఎం పీఠానికి చేరువయ్యాడు నాటి కేంద్ర మంత్రి రాజేష్ పైలట్ తనయుడు సచిన్ పైలట్. రాజస్థాన్ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయ్. ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాక్‌కు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. సీఎం పదవి వదిలిపెట్టి ఏఐసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకునేందుకు ఆయున ససేమిరా అంటున్నప్పటికీ పార్టీ మాత్రం పైలట్‌ను సీఎం పీఠంపై కూర్చొబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సచిన్ పైలట్‌కు ఎట్టిస్థితిలో పీఠం అప్పగించరాదని బీష్మించుకు కూర్చున్న పెద్దాయనతోనే కాంగ్రెస్ పార్టీ అన్నీ కానిస్తోంది. ఇష్టం లేనిని… కష్టంగానైనా… చేయించడం అలవాటుగా మార్చుకున్న హస్తం పార్టీ ఇప్పుడు రాజస్థాన్ వ్యవహారాన్ని కూడా అదే పంథాలో సాగిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత గెహ్లాట్, పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు వచ్చాయ్. సీనియర్ ను గౌరవించి గెహ్లాట్‌కు సీఎం బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ… జూనియర్ అయిన సచిన్ పైలట్‌కు డిప్యూటీ సీఎం బాధ్యతలు కట్టబెట్టింది. నాటి నుంచి ఇరు వర్గాల మధ్య ఢిష్యుం ఢిష్యుం సాగుతూనే ఉంది.

రాజేష్ పైలట్ ఆకస్మిక మరణంతో కాంగ్రెస్ పార్టీలో అరంగేట్రం చేసిన సచిన్ పైలట్.. పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. సెప్టెంబర్ 7, 1977లో పైలట్ జన్మించారు. విదేశాల్లో విద్యను అభ్యసించిన సచిన్ పైలట్… జమ్ము, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తనయ సారాను వివాహం చేసుకున్నారు. వీరికి అరాన్, విహాన్ ఇద్దరు కుమారులు. 2004, 2009లో లోక్ సభ అభ్యర్థిగా దౌసా, అజ్మీర్ నుంచి పైలట్ ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కంపెనీ వ్యవహారాలకు స్వతంత్ర మంత్రిగానూ అంతకంటే ముందు కమ్యూనికేషన్లు, సమాచార శాఖ సహాయ మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఓడిన పైలట్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టాంక్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 26 ఏళ్లకే దౌసా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి ఇండియాలోనే రికార్డు సృష్టించారు సచిన్ పైలట్. ఇక 2009లో అజ్మీర్ నుంచి గెలిచి వరుస ఎన్నికల్లో విజయం సాధించారు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లో అడుగుపెట్టినా.. తనకంటూ చెరగని ముద్రవేశారు సచిన్ పైలట్.

2014 లోక్ సభ ఎన్నికల్లో ఓడిన తర్వాత పార్టీ ఆయనను… రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టాంక్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి సత్తా చాటారు. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక భూమిక పోషించిన పైలట్‌కు సీఎం బాధ్యతలు అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ పార్టీ పెద్దలు మాత్రం అనూహ్యంగా తెరపైకి అశోక్ గెహ్లాట్‌ను తీసుకొచ్చారు. సచిన్ పైలట్ డిప్యూటీ సీఎం బాధ్యతలతో సరిపెట్టుకున్నారు. అయితే ప్రభుత్వంలో చేరినా… పైలట్.. గెహ్లాట్ మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. మొత్తం 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్ తిరుగుబాటు ప్రకటించారు. స్పీకర్ సీపీ జోషీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసే వరకు పరిస్థితి వెళ్లింది. స్పీకర్ నిర్ణయంపై పైలట్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. పైలట్ బృందానికి హైకోర్టులో ఉపశమనం లభించింది.

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చి.. బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా తరహాలోనే… సచిన్ పైలట్ సైతం బీజేపీలో చేరతారని అందరూ భావించారు. నాడు మొత్తం పరిణామాలు అలాగే కన్పించాయ్. కానీ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక జోక్యంతో ఆయన వెనక్కితగ్గారు. తాజాగా పార్టీ ఆయనకు సీఎం పదవిని ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. 2023 డిసెంబర్‌లో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గట్టెక్కాలంటే అది పైలట్‌తో మాత్రమే సాధ్యమవుతుందని యువ కాంగ్రెస్ నేతలంతా భావిస్తున్నారు. రాహుల్, ప్రియాంక సైతం పైలట్ వస్తేనే కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజంకుంటుందని భావిస్తున్నారు. ఎవరైతే సచిన్ పైలట్‌ను అసహ్యించుకుంటారో ఆయన ఏఐసీసీ చీఫ్ గా ఎన్నికవుతున్న సమయంలో.. ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. విధి ఎంత విచిత్రమైనదన్నదానికి ఇదో ఉదాహరణ.