రైల్వే ప్రైవేటీకరణ మరింత ముందుకు..!
రైల్వేల ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఖాళీగా ఉన్న రైల్వే స్థలాలను లీజుకు ఇవ్వాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయించింది. దీంతో రైల్వే స్థలాల్లో ప్రైవేటు వ్యక్తులు వ్యాపారాలు నిర్వహించే అవకాశం లభించనుంది. కేంద్రం నిర్ణయంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తొలుత ఖాళీ స్థలాలను లీజుకిస్తారని.. తర్వాత ఆదాయం వస్తుందన్న సాకుతో ఆ స్థలాలను అమ్మేస్తారని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఈ చర్య రైల్వేల ప్రైవేటీకరణకు తలుపులు బార్లా తెరవడమేనని విమర్శిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కోటి ప్రైవేటు పరం చేస్తూ వెళ్తోంది. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను అదానీ ఇప్పటికే సొంతం చేసుకున్నారని.. మోదీ సర్కారు అదానీ, అంబానీల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి.