Andhra PradeshNews

ఏపీలో ముగిసిన రాహుల్ పాదయాత్ర

◆ అందరికీ ధన్యవాదాలు చెప్పిన రాహుల్
◆ ప్రత్యేక హోదా, అమరావతికి కట్టుబడి ఉన్నామని వెల్లడి
◆ ప్రజలకు రాహుల్ లేఖ

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర శుక్రవారంతో ఆంధ్ర ప్రదేశ్ లో ముగిసి మళ్లీ కర్ణాటకకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రజలను ఉద్దేశించి రాహుల్ లేఖ రాశారు. తన పాదయాత్రకు ప్రజలు చూపిన ఆదరణకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో యాత్ర సందర్భంగా ప్రజలను ప్రభావితం చేస్తున్న పలు సమస్యలు తనను పలకరించాయని రాహుల్ గాంధీ అన్నారు. ప్రత్యేక హోదా అమరావతి రాజధానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వ రంగ హోదా కొనసాగింపును సమర్థిస్తున్నామని ఏపీలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం కంచుకోటగా ఉందని… కాంగ్రెస్ తన పూర్వ స్థానానికి చేరుకోటానికి చేయగలిగిందంతా చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.

ఈ ప్రయాణంలో భారత్ జోడోయాత్ర మొదటి అడుగుగా నిలుస్తున్నదని నమ్ముతున్నానని లేఖలో పేర్కొన్నారు. ప్రజల వాణిని వినటానికి దేశంలోని ప్రజలు రోజువారి సవాళ్లపై లోతైన అవగాహన పొందటానికి యాత్ర ఒక ప్రత్యేకమైన అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా రైతులు, యువత, మహిళలు, కార్మికులతో మాట్లాడానని 2014 పార్లమెంటులో ఏపీ ప్రజలకు చేసిన వాగ్దానం గుర్తు చేస్తున్నానని ఇది ఒక వ్యక్తి లేదా ఒక పార్టీ చేసిన హామీలు కాదని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పార్లమెంటు చేసినవని అన్నారు. రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో నాలుగు రోజులు పాటు సాగిన రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర మంత్రాలయంలో ముగిసింది. మొత్తం 96 కిలోమీటర్ల పైగా రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రలో ఏపీకి చెందిన కీలక నాయకులతో పాటు, తెలంగాణ నేతలు కూడా పాల్గొన్నారు.