వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక పర్యటన
కేరళలోని వయనాడ్‌కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేరుకున్నారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో వయనాడ్‌లో భారీ ప్రాణనష్టం జరిగింది. అనేకమంది రక్షణ శిబిరాలలో తల దాచుకుంటున్నారు. వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ఈ రక్షణ శిబిరాల వద్దకు బాధితులను పరామర్శించనున్నారు. లోక్ సభ ఎన్నికలలో గెలుపు అనంతరం వయనాడ్ లోక్ సభ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులుకున్న సంగతి తెలిసిందే. ఈ స్థానంలో కాంగ్రెస్ తరపున ప్రియాంక పోటీ చేయబోతున్నారు. దీనితో వారిద్దరూ ఈ ప్రదేశంలో పర్యటనకు బుధవారమే రావాలని అనుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించపోవడంతో గురువారం వచ్చారు. ఈ దుర్ఘటనలో ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం 280 మంది మరణించగా, 240 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వందల మంది నిరాశ్రయులయ్యారు. ఇంకా అనేకమంది మట్టి పెళ్లల కింద కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ఇంకా అనేక మంది ఆచూకీ దొరకలేదని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.