వైయస్సార్సీపీ అక్రమాలపై ప్రజా కోర్టు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్
వచ్చే ఎన్నికల్లో జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో సంక్షేమం నిలిచిపోతుందేమో అనుకోవద్దు ఎందుకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలే ఉంటాయి తప్ప ఏ పథకము ఆగిపోదని, జాతీయ నాయకుల పేర్లతో సరికొత్త పథకాలు అమలు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీర మహిళలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు ఇలా భిన్న వర్గాల వారు జగన్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని బతకటానికి భయపడే పరిస్థితులు వచ్చాయని మధనపడుతున్నారని అన్నారు. అందరికీ తాను చెప్పేది ఒకటేనని ఈ నేలను విడిచి వారి ఎక్కడికి పారి పోవాల్సిన అవసరం లేదని సమిష్టిగా పోరాడి వచ్చే ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధంతో జగన్ వంటి వ్యక్తులను తరిమికొడదామని అన్నారు. జగన్ నివాసముండే తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే నేరాల రేటు ఎక్కువగా ఉందని మహిళలకు న్యాయం చేయలేని వారిని గౌరవించలేని మనసుతో మీరు ఎన్ని చట్టాలు చేసిన వృధానే అని శాంతి భద్రతల రక్షణకు జనసేన తొలి ప్రాధాన్యం ఇస్తుందని మహిళల భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థలు పనిచేసేలా చేస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకుల దాష్టీకాలను, దుర్మార్గాలను చూసి ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం పెరిగిందని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైఎస్సార్సీపీ నాయకులను నామరూపాలు లేకుండా చేస్తుందన్నారు. పార్టీలతో వర్గాలతో సంబంధం లేకుండా ప్రజల ఆస్తులను దోపిడీ చేసే వారికి కచ్చితంగా జనసేన ప్రభుత్వంలో తగిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
