మోదీ హయాంలో తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ సంపదకు సరైన గౌరవం!
రూ. 610 కోట్లతో ఆధ్యాత్మిక కేంద్రాలు, చారిత్రక కట్టడాలకు పునర్వైభవం
కాకతీయుల నుంచి నిజాం నవాబుల వరకు అన్ని వారసత్వ కట్టడాల పరిరక్షణ
‘వికాస్ భీ, విరాసత్ భీ’ నినాదంతో.. దేశాభివృద్ధితోపాటు సంస్కృతి, సంప్రదాయాలు, కళల సంరక్షణ
ఈ ఏడాది ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ‘హెరిటేజ్ ఛేంజెస్’ థీమ్‌తో కార్యక్రమాలు
“ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని” పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పత్రిక ప్రకటన.
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ ఏడాది వారసత్వ దినోత్సవాన్ని ‘హెరిటేజ్ ఛేంజెస్’ ఇతివృత్తం (థీమ్) తో నిర్వహించాలని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ICOMOS) నిర్ణయించింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మన వారసత్వ కట్టడాల పరిరక్షణకు సాంప్రదాయ రీతిలో ఎలా కృషి చేయాలన్నదే ఈ ఇతివృత్తం లక్ష్యం. మన వారసత్వ కట్టడాల పరిరక్షణ, మన సంస్కృతి, సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలను నిర్దేశించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కూడా అవసరమైన చర్యలను చేపడుతోంది. మన సంస్కృతి, సాంప్రదాయాలను, మన కళలను, జీవన విధానాన్ని భవిష్యత్ తరాలకు అందించటంలో చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద కీలకమైన పాత్ర పోషిస్తుంది. అలాంటి వారసత్వ సంపదను సంరక్షించుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ‘వికాస్ భీ.. విరాసత్ భీ’ నినాదంతో దేశ అభివృద్ధితో పాటు ప్రపంచంలోనే అత్యంత విశిష్టతను కలిగిన మనదేశ వారసత్వ సంపదను పరిరక్షించుకోవటానికి, విభిన్నమైన మన సంస్కృతి, సాంప్రదాయాలను, కళలను భవిష్యత్ తరాలకు అందించటానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
అందులో భాగంగా ఒక ప్రాంతంలోని సంస్కృతిని మరొక ప్రాంతానికి పరిచయం చేసి మన సంస్కృతిని కొనసాగించటానికి, మనమంతా ఒక్కటే అని చాటిచెప్పటానికి ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ నినాదాన్ని విధానంగా మలచుకొని ముందుకు సాగుతోంది. అక్రమ మార్గంలో విదేశాలకు తరలించిన మనదేశానికి సంబంధించిన ఎన్నో పురాతన వస్తువులను తిరిగి మనదేశానికి తీసుకురావడంలో నరేంద్రమోదీ ప్రభుత్వం తీవ్రమైన కృషి చేస్తోంది. 2014 కు ముందు కేవలం 13 పురాతన వస్తువులు భారత్ కు తిరిగి రాగా, కేవలం గత 9 సంవత్సరాల కాలంలో 231 పురాతన వస్తువులను భారత్ కు తిరిగి తీసుకురావడం జరిగింది. మనదేశ చారిత్రక సంపద సంరక్షణ పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం. ఇవే కాకుండా మరో 72 పురాతన వస్తువులను అమెరికా, UK, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి భారత్ కు తిరిగి తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా 40 చారిత్రక ప్రదేశాలు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందగా అందులో 10 ప్రదేశాలు గత 9 సంవత్సరాల కాలంలోనే గుర్తింపును సాధించాయి. అంతేకాకుండా 35 గా ఉన్న మన దేశ ప్రపంచ వారసత్వ సంపద (కట్టడాలు) ముసాయిదా జాబితా 52 కు పెరిగింది. ఎంతో చైతన్యవంతమైన మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, కళల కొనసాగింపునకు, వైవిధ్యమైన మన వారసత్వ సంపద పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం విరివిగా నిధులను కేటాయించి వాటిని భవిష్యత్ తరాలకు అందించటానికి ఎంతగానో కృషి చేస్తున్నది. ఇవాళ ‘ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని’ పురస్కరించుకొని వాటి వివరాలను పత్రికాముఖంగా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలనుకుంటున్నాను.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా చరిత్రలో తొలిసారి ‘తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను’ నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా, అట్టహాసంగా నిర్వహించింది. ఇది తెలంగాణ ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ వేడుకలను సంవత్సరకాలంపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. అంతేకాకుండా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ నినాదాన్ని ప్రతిబింబిస్తూ వరంగల్, హైదరాబాద్ నగరాలలో ఎంతో ఘనంగా ‘రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్’ వేడుకలను నిర్వహించాం.
కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ – పైగా టూంబ్స్ – హయత్ బక్షి మసీదు – రేమండ్స్ టూంబ్స్ ను కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్ అభివృద్ధి కోసం స్వదేశ్ దర్శన్ పథకం కింద ఆయా వారసత్వ సంపదల పరిరక్షణకు చర్యలు చేపట్టాము. ‘ములుగు – లక్నవరం – మేడవరం – తాడ్వాయి – దామరవాయి – మల్లూరు – బొగత జలపాతం’లను కలుపుతూ గిరిజన సర్క్యూట్ పేరుతో ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను కల్పించాం. మన గిరిజన సమాజం కూడా నిరంతరం ప్రకృతితో మమేకమై.. మన జీవన విధానం ఇలాగే ఉండాల్సిన అవసరాన్ని మనకు అనునిత్యం గుర్తుచేస్తోంది. నేడు పర్యావరణం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు గిరిజనుల జీవనం ద్వారా అందుతున్న సందేశం, తదితర అంశాలను వివరిస్తూ.. తీసుకొచ్చిన ట్రైబల్ సర్క్యూట్ వంటివి.. సుస్థిర పర్యాటకానికి కూడా బాటలు వేస్తున్నాయి. సోమశిల, సింగోటం, కదళీవనం, అక్కమహాదేవి, ఈగలపెంట, ఫరాహాబాద్, ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం మధ్య ఎకో-సర్క్యూట్ అభివృద్ధి కోసం స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాం. గోల్కొండ కోటకు సౌండ్, ఇల్యుమినేషన్, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో సౌండ్, ఇల్యుమినేషన్, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటవుతోంది. హైదరాబాద్ రైల్వే స్టేషన్ ను నాటి చరిత్రకు ప్రతిబింబంగా తీర్చిదిద్దుతున్నాం. హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియంలో ‘ఎపిగ్రఫి మ్యూజియం’ను ఏర్పాటు చేస్తున్నాం. చార్మినార్ నిర్వహణ కోసం ASI ద్వారా పనులు జరుగుతున్నాయి. దీంతోపాటుగా హైదరాబాద్‌లో ‘కొమురం భీమ్ గిరిజన మ్యూజియం’ను ఏర్పాటు చేస్తున్నాం. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ పట్టణానికి హెరిటేజ్ సిటీ గుర్తింపునిస్తూ.. పట్టణంలోని వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు చేపట్టడం జరిగింది. వరంగల్ కోటలో సౌండ్, ఇల్యుమినేషన్, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. హన్మకొండలోని వేయి స్తంభాల గుడిలో ASI ద్వారా మంటపాన్ని నిర్మించడం జరుగుతోంది.
తెలంగాణలోని రామప్ప ఆలయం యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు సాధించటానికి నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. అంతేకాకుండా, ప్రసాద్ పథకం క్రింద, ASI ద్వారా రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని కూడా ప్రసాద్ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నాం. శక్తి పీఠమైన ఆలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయాన్ని కూడా ప్రసాద్ పథకం మరియు ASI ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము.
తెలంగాణకు ప్రతిరూపంగా నిలిచే బతుకమ్మ, బోనాలు తదితర పండుగల వేడుకల నిర్వహణ కోసం, లక్షలాదిమంది గిరిజనులు ఎంతో వైభవంగా జరుపుకునే మేడారం జాతర నిర్వహణ కోసం, యాత్రికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో తనవంతు పాత్ర పోషించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పర్యావరణం కోసం జీవనశైలిలో మార్పు’ (Our Lifestyle for Environment – LIFE) కూడా గిరిజనుల జీవన విధానం నుంచి స్ఫూర్తి పొంది రూపొందించినదే. ఈ ఏడాది ప్రపంచ వారసత్వ దినోత్సవం ఇతివృత్తమైన ‘హెరిటేజ్ ఛేంజెస్’ కూడా ఈ అంశాన్నే ప్రతిబింబిస్తోంది. అంతేకాకుండా, నాగార్జున సాగర్ లో బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం నిధులు అందజేసింది. ఇలా తెలంగాణలోని చారిత్రక సంపద పరిరక్షణకు, ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాల కొనసాగింపునకు గత 9సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 610 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ సంగీత, నాటక, నాట్య కళలను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ నగరంలో సంగీత నాటక అకాడెమీ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాను. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు, వారి కుటుంబ సభ్యులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు హైదరాబాద్ నగరంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనున్న ‘సైన్స్ సెంటర్’ ప్రాజెక్టుకు 25 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కోరుతూ పలుమార్లు లేఖలు కూడా రాశాను. ఈ రెండు విషయాలలో తెలంగాణ ప్రభుత్వం ఎంత త్వరగా స్పందిచి సహకరిస్తే, అంత త్వరగా ఆయా ప్రాజెక్టులను ప్రారంభించటానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.
తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల జాబితా
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ వేడుకలు (వరంగల్, హైదరాబాద్)
కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ – పాయ్ గా టూంబ్స్ – హయత్ బక్షి మాస్క్ – రేమండ్స్ టూంబ్స్ ను కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్ అభివృద్ధి (స్వదేశ్ దర్శన్ పథకం)
ములుగు – లక్నవరం – మేడవరం – తాడ్వాయి – దామరవాయి – మల్లూరు – బొగత వాటర్ ఫాల్స్ లను కలుపుతూ గిరిజన సర్క్యూట్ అభివృద్ధి (స్వదేశ్ దర్శన్ పథకం)
సోమశిల, సింగోటం, కదళీవనం, అక్కమహాదేవి, ఈగలపెంట, ఫరాహాబాద్, ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం మధ్య ఎకో-సర్క్యూట్ అభివృద్ధి (స్వదేశ్ దర్శన్ పథకం)
గోల్కొండ కోటకు సౌండ్, ఇల్యుమినేషన్, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు
ఉస్మానియా యూనివర్సిటీలో సౌండ్, ఇల్యుమినేషన్, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు
హైదరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి
చార్మినార్ నిర్వహణ (ASI ద్వారా)
కొమురం భీమ్ గిరిజన మ్యూజియం
హెరిటేజ్ సిటీ ప్రాజెక్ట్, వరంగల్
వరంగల్ కోటలో సౌండ్, ఇల్యుమినేషన్, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు
హన్మకొండ వేయి స్తంభాల గుడిలో మంటపం నిర్మాణం (ASI ద్వారా)
రామప్ప ఆలయం (ప్రసాద్ పథకం మరియు ASI ద్వారా)
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం (ప్రసాద్ పథకం)
ఆలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయం (ప్రసాద్ పథకం మరియు ASI ద్వారా)
బతుకమ్మ, బోనాలు తదితర పండుగలు, మేడారం జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం
బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణం, నాగార్జునసాగర్
సంగీత నాటక అకాడెమీ ప్రాంతీయ కేంద్రం, హైదరాబాద్