రేపే విశాఖకు ప్రధాని మోదీ
◆ వారం నుంచి ఇరు పార్టీల నేతలు విశాఖలోనే మకాం
◆ ప్రధాని సభకు విశేష ఏర్పాట్లు
◆ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
◆ జన సమీకరణలో వైసీపీ శ్రేణులు
భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు ఏపీ ప్రభుత్వం విశేష ఏర్పాట్లు చేస్తుంది. ఈనెల 11న మోదీ పర్యటన నేపథ్యంలో గత వారం రోజులుగా ప్రధాని పర్యటన పైనే అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు బీజేపీ కీలక నేతలు దృష్టి సారించారు. ఇప్పటికే వైసీపీ, బీజేపీ పార్టీలు మోదీ పర్యటన షెడ్యూల్ ను విడివిడిగా విలేకరుల సమావేశం పెట్టి వెల్లడించారు. ఏడు కీలక ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నట్లు ఇప్పటికే వెల్లడయింది. కానీ భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేస్తూ కీలక తీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రధాని షెడ్యూల్ లో భోగాపురం పోర్టు శంకుస్థాపనను కూడా చేర్చాలని వైసీపీ పట్టు పడుతుంది.

అటు బీజేపీ కూడా ప్రధాని టూర్ లో తన మార్క్ ఉండాలని భావిస్తుంది. దీంతో చివరి నిమిషంలో కొంత మార్పులు తప్పడం లేదు. తాజాగా ప్రధాని మోడీ విశాఖపట్నం టూర్ లోకి అనూహ్యంగా రోడ్ షో వచ్చి చేరింది. ప్రధాని 11 న విశాఖకు రాగానే నగరంలో సాయంత్రం రోడ్డు షో నిర్వహించేందుకు బీజేపీ సిద్దమవుతుంది. తద్వారా ప్రధాని మోడీ విశాఖకు అలాగే ఏపీకి చేస్తున్న సాయాన్ని చెప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ లో ఈ రోడ్డు షో లేదు కానీ చివరి నిమిషంలో బీజేపీ నేతలు పట్టు పట్టి దీన్ని చేర్పించినట్లు తెలుస్తోంది.

ప్రధాని విశాఖకు చేరుకోగానే రోడ్ షో ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు బుధవారం ప్రకటించారు. ప్రధాని తన టూర్ లో ఏడు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారని, వీటిలో పలురోడ్డు ప్రాజెక్టులు ఉన్నాయని అయితే కీలకమైన విశాఖ రైల్వే జోన్ కు మాత్రం ప్రధాని శంకుస్థాపన చేయడం లేదని తెలిపారు. అలాగే రాజధాని అంశం కూడా ప్రధాని టూరులో ఉండబోదని జీవీఎల్ ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమం కావటంతో జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ప్రధాని పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైంది. గత వారం రోజులుగా ప్రధాని పర్యటన పైనే అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు బీజేపీ నేతలు దృష్టి సారించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి కొద్దిరోజులు విశాఖలోనే ఉండి ప్రధాని పాల్గొనే సభా ఏర్పాట్లతోపాటు జన సమీకరణకు సంబంధించి మంత్రి గుడివాడ అమర్నాథ్, ఇతర ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రధానమంత్రి పాల్గొనే వేదికను అందంగా తీర్చిదిద్దంతోపాటు సభకు హాజరయ్యే వారికి అన్నీ సదుపాయాలు కల్పించేందుకు జిల్లా కలెక్టరు మల్లికార్జున ఇతర అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు.
