ఉత్తరాఖండ్‌లో 3,400 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం
కేదార్‌నాథ్ : మనసర్కార్ :
ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ పర్యటన కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. అక్కడ నుండి బద్రీనాథ్‌కు బయలుదేరారు. ప్రధాని పర్యటన సందర్భంగా కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను క్వింటాళ్ల కొద్దీ పూలతో అలంకరించారు.
ఈ పర్యటనలో భాగంగా 3,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. 9.7 కిలోమీటర్లు పొడవైన గౌరీకుండ్- కేదార్ నాథ్ రోప్‌వే ప్రాజెక్టు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బద్రీనాథ్‌లోని రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. ఇంకా సీమంత్ రోడ్డు, రోప్ వే ప్రాజెక్టులు, చెరువుల సుందరీకరణ, అరైవల్ ప్లాజా పనులను సమీక్షిస్తారు. రాత్రికి బద్రీనాథ్‌లోనే బస చేయనున్నారు. రేపు ఉదయం 7.15 గంటలకు డెహ్రాడూన్ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ పర్యటనను ఉద్దేశించి, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ పర్యటన కేదార్ నాథ్, బద్రీనాథ్ అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.