హామీలు నెరవేరిస్తే మద్దతిస్తా: పీకే
ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సీఎం కుర్చీపై ఫెవికాల్తో కూర్చున్నారన్నారు. ఇతర పార్టీలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. ఎన్డీయే నుంచి వైదొలిగిన నితీశ్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో జట్టు కట్టి బీహార్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బీహార్ సీఎంగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల తర్వాత నితీష్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ప్రజల నుంచి పెద్దగా ఆదరణ లేదని ఆయన పేర్కొన్నారు.

బీహార్ ప్రజలకు ఇచ్చిన హమీని నెరవేరిస్తే జన్ సూరజ్ అభియాన్ ప్రచారాన్ని నిలిపివేస్తానని, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారని, అలాగే నితీశ్ కుమార్ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో ఇద్దరూ తమ హామీని నెరవేర్చినట్లయితే, తమ జన్ సూరజ్ అభియాన్‌ను నిలిపివేస్తామని మరియు నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తామని ఆయన అన్నారు. జన్ సూరజ్ అభియాన్ ద్వారా ప్రశాంత్ కిషోర్ నేరుగా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రాంతాల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారాలు కనుగొనడమే జాన్ సూరాజ్ అభిమాన్ ఉద్దేశమని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం 2025 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

