కర్నాటకలో అధికారం మాదే.. రాజస్థాన్‌లో గెలిచేది మేమే: అమిత్ షా
రాబోయే కర్నాటక ఎన్నికలలో, బీజేపీ సగానికి పైగా సీట్లను సాధిస్తుందని… రాష్ట్రంలో స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని షా అన్నారు. కర్నాటకలో ఎలాంటి పొత్తు ఉండదని షా అన్నారు, బీజేపీ కచ్చితంగా సగం మార్కును దాటుతుందని… కర్ణాటకలో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. రికార్డు స్థాయిలో విజయం సాధిస్తామన్నారు. మత ప్రాతిపదికన కోటాను రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ, మతం ఆధారంగా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు అమిత్ షా. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, మత ప్రాతిపదికన చేసిందన్నారు. ఇప్పుడు దానిని బీజేపీ సరిదిద్దిందన్నారు. ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి తోసిపుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేము ఎప్పుడూ ప్రతిపక్షాలను నిందించలేదని, అమాయక పోలీసు అధికారులను కటకటాల వెనక్కి నెట్టారని షా అన్నారు.

మహారాష్ట్ర ప్రశ్నపై, ప్రజలు శివసేన, బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకున్నారని, ఇప్పుడు నిజమైన శివసేనతో బీజేపీ ఉందన్నారు. మహారాష్ట్రలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని నేను కూడా అంగీకరిస్తున్నానన్నారు. బీజేపీలో శివసేన విలీనం ప్రశ్నే లేదన్నారు. అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు అమిత్ షా. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తాందన్నారు. రాజస్థాన్ నాయకత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న షా… రాజస్థాన్ సీఎంను మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.