Andhra PradeshHome Page Slider

చదువుకు పేదిరికం అడ్డు కాదు : సినీ నటుడు బ్రహ్మానందం

చదువుకు పేదరికం అడ్డు కాదని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ బ్రహ్మానందం అన్నారు. శనివారం రాత్రి తాడేపల్లి కేఎల్ విశ్వవిద్యాలయంలో జరిగిన సమ్యక్ వార్షిక వేడుకలకు ముఖ్య అతిథిగా హజరయిన ఆయన విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. కేఎల్ విశ్వవిద్యాలయంలో సమ్యక్ వేడుకలు ఘనంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా సినీ నటుడు డాక్టర్ బ్రహ్మానందంను కెఎల్ యు చైర్మన్ కోనేరు సత్యన్నారాయణ సాదరంగా ఆహ్వానించారు. కుంచనపల్లి పాతూరు రోడ్డు వద్దకు బ్రహ్మానందం అభిమానులు పెద్ద సంఖ్యంలో చేరుకుని బ్రహ్మానందానికి ఘనస్వాగతం పలికారు. ద్విచక్ర వాహనాలతో భారీ ఊరేగింపుతో విశ్వవిద్యాలయానికి తోడుకుని వచ్చారు. బ్రహ్మానందం రాకతో వడ్డేశ్వరం, కుంచనపల్లి పరిసర ప్రాంతాలలో పండుగవాతావరణం నెలకొంది.

డాక్టర్ బ్రహ్మానందం మాట్లాడుతూ తాను నిరుపేద కుటుంబంలో జన్మించానని అన్నారు. సత్తెనపల్లి మండలం, ముప్పాళ్ల దగ్గర ఉన్న చాగంటివారి పాలెంలో తాను చిన్న తనం నుండి ఎన్నో ఇబ్బందులను అధిగమించినట్లు తెలిపారు. కేఎల్ విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్ కోనేరు హవీష్ హీరోగా నటిస్తున్న ఎస్ బాస్ చిత్రంలో తాను ఎస్ బాస్ గా నటిస్తున్నట్లు తెలిపారు. పేదరికాన్ని ద్వేషించవద్దన్నారు. పేదరికాన్ని ప్రేమించండి, ఆదరించండి అది మీకు జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పుతుందంటూ బ్రహ్మానందం చేసిన ప్రసంగానికి విద్యార్ధులు కేరింతలు కొట్టారు. జై బ్రహ్మీ, జైజై బ్రహ్మీ అంటూ నినాదాలు చేస్తు బ్రహ్మానందానికి జేజేలు పలికారు. చైర్మన్ కోనేరు సత్యన్నారాయణ మాట్లాడుతూ కేఎల్ విశ్వవిద్యాలయంలో విద్యా వ్యవస్థ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పోటీ పడుతుందన్నారు.