NationalNews

కేబుల్‌ బ్రిడ్జి ప్రమాద బాధితులకు మోదీ పరామర్శ

గుజరాత్‌ రాష్ట్రం మోర్బీలోని బ్రిటిష్‌ కాలం నాటి కేబుల్‌ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కూలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో 140 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. మరికొందరు గల్లంతు అయ్యారు. వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

కూలిన కేబుల్‌ బ్రిడ్జి ఘటన స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోర్బీ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న బాధితులను పరామర్శించారు. ఘటనపై దిగ్ర్భాంతి  వ్యక్తం చేసిన ఆయన.. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానితోపాటు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

ఇదిలా ఉంటే.. బాధితులను పరామర్శించడానికి ప్రధాని వస్తారని తెలిసి ఈ బ్రిడ్జ్‌కు మరమ్మతులు చేసిన సంస్థ పేరును కనిపించకుండా ప్లాస్టిక్‌ షీట్‌తో కవర్‌ చేశారు. దీనిని విపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి.