NationalNews

మోదీ హత్యకు పీఎఫ్‌ఐ కుట్ర..!

పాపులర్ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)కు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఉచ్చు బిగించింది. దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దాడులు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా జరిపిన దర్యాప్తులో ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్‌ఐ కుట్ర పన్నినట్లు ఆధారాలు లభించాయని ఎన్‌ఐఏ అంటోంది. జూలై నెలలో మోదీ బీహార్‌లోని పాట్నాలో పర్యటించినప్పుడు ఆయనపై దాడికి విఫలయత్నం జరిగినట్లు గుర్తించింది. ఈ దాడి కోసం పలువురికి పీఎఫ్‌ఐ శిక్షణ కూడా ఇచ్చిందని, మారణాయుధాలు సైతం సమకూర్చిందని ఎన్‌ఐఏ ఆధారాలు సేకరించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరికొందరు ప్రముఖులపైనా దాడులకు పీఎఫ్‌ఐ కుట్ర చేసినట్లు పేర్కొన్నది.

పీఎఫ్‌ఐకి కోట్లాది రూపాయల నిధులు

ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ 45 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. పీఎఫ్‌ఐకు దేశ, విదేశాల నుంచి విరాళాల రూపంలో కోట్లాది రూపాయలు లభించాయని తెలిపింది. పీఎఫ్‌ఐ ఖాతాలో రూ.120 కోట్లు జమ అయ్యాయని..  నగదు రూపంలో దానికి రెండింతలు వసూలు చేశారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ డబ్బును పీఎఫ్‌ఐ కార్యకర్తలకు ఉగ్రవాద శిక్షణ ఇచ్చేందుకు వినియోగించారని స్పష్టమైంది. ఆయుధాలు కూడా సమకూర్చుకున్నారని తేలింది.

రహస్య శిక్షణ..

కరోనా సమయంలో నిజామాబాద్‌లో పీఎఫ్‌ఐ రహస్య కార్యకలాపాలు సాగించింది. నిజామాబాద్‌లో కరాటే మాస్టారు అబ్దుల్‌ ఖాదర్‌ను అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ కార్యకలాపాల డొంకంతా కదిలింది. కరాటే ముసుగులో ఖాదర్‌ తన ఇంటి టెర్రస్‌నే ఉగ్రవాద శిక్షణా శిబిరంగా మార్చాడు. తెలుగు రాష్ట్రాల్లోనే 40 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ, ఈడీ దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఉగ్రవాద సాహిత్యం, పలు పత్రాలు, డిజిటల్‌ సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నాయి.

రహస్యంగా వాట్సాప్‌ గ్రూపులు..

2006లో ప్రారంభమైన పీఎఫ్‌ఐకి 20కి పైగా రాష్ట్రాల్లో వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. స్టూడెంట్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా(సిమీ)ను నిషేధించడంతో ఆ సంస్థ కార్యకర్తలు, నాయకులే పీఎఫ్‌ఐ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశారని ఆరోపణలొస్తున్నాయి. మరో నిషేధిత సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌తోనూ పీఎఫ్‌ఐకు సంబంధాలున్నాయని సమాచారం అందుతోంది. పీఎఫ్‌ఐ రెండు రహస్య వాట్సాప్‌ గ్రూపులు నిర్వహిస్తోందని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. ఒక గ్రూపులో పాకిస్థాన్‌, యెమెన్‌, ఇతర గల్ఫ్‌ దేశాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. మరో గ్రూపులో భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు చెందిన సభ్యులు ఉన్నారని తేలింది.