InternationalNationalNews

పట్టువదలని వత్సల్.. ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం

‘కష్టేఫలి’ అని పెద్దలు ఊరికే అనలేదు. కష్టపడి ప్రయత్నిస్తూ ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు ఢిల్లీకి చెందిన వత్సల్ నహతా. ఢిల్లీ శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో అర్థశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన వత్సల్ నహతా ఉన్నత చదువులకై అమెరికాలోని  ‘యేల్ యూనివర్సిటీ’కి వెళ్లాడు. 2020 కొవిడ్ మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో అతని మాస్టర్స్‌ డిగ్రీ పూర్తయ్యింది. అయితే.. అతనికి ఏ ఉద్యోగమూ దొరకలేదు. ఎన్ని పోస్టులకు అప్లయ్ చేసినా అతని ప్రయత్నం ఫలించ లేదు. దీనితో చాలా డిప్రెషన్‌కు లోనయ్యి, తల్లిదండ్రులతో కూడా ఫోన్‌లో మాట్లాడడం మానుకున్నాడు. ఉద్యోగం లేకుండా భారత్‌కు తిరిగి వెళ్లాలనుకోలేదు. తన తొలి సంపాదన డాలర్లలోనే ఉండాలనుకున్నాడు.

ఎన్నో తిరస్కరణలు.. అయినా ప్రయత్నాన్ని ఆపలేదు

ఈసారి వినూత్నంగా ప్రయత్నించాడు. మామూలు జాబ్ పోర్టల్‌లో కాకుండా సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు పెంచుకుంటూ వెళ్లాడు. రెండు నెలల వ్యవధిలో 1500 మందితో ఫ్రెండ్‌షిప్‌లు పెంచుకున్నాడు. విసుగు చెందకుండా 600 మెయిల్స్ చేశాడు. 80కి పైగా సంస్థలకు ఫోన్లు చేశాడు. ఎన్నో సంస్థలు అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు తిరస్కరించాయి. అయినా విసుగు చెందలేదు. పోరాటాన్ని విరమించుకోలేదు. చివరకు ‘పాతాళభైరవి’ సినిమాలో తోటరాముడిని రాజకుమారి వరించినట్లు.. అతనికి ఏకంగా నాలుగు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇప్పడు ఏ ఉద్యోగం ఎంపిక చేసుకోవాలన్న ఛాన్స్ అతని చేతికి వచ్చింది. అతడు ప్రపంచ బ్యాంక్‌ను ఎంపిక చేసుకున్నాడు. అతనికి ఏకంగా ప్రపంచ బ్యాంక్ డైరక్టరుతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. 23 ఏళ్ల చిన్నవయస్సులో ఇంత పెద్ద ఉద్యోగం, అంత పెద్ద బాధ్యత నిర్వహించే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయమని వత్సల్‌ అన్నాడు.

చిన్నవాటితో సంతృప్తి పడకూడదు..

ఈ విషయాన్ని అతడు ‘లింక్డిన్’ వేదికగా సోషల్ మీడియాలో వత్సల్‌ పంచుకున్నాడు. కష్టసమయంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని, యువత ప్రయత్నాన్ని విరమించి వెనుకడుగు వేయకూడదని సూచనలిచ్చాడు. చిన్న వాటితో సంతృప్తి పడకూడదని, తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటూ, ముందుకు సాగాలని అప్పుడే మంచి రోజులు వస్తాయని పేర్కొన్నాడు. అతని ఈ సూచన ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ పోస్టు వైరల్‌గా మారింది. దీన్ని అనేక మంది షేర్ చేశారు. 15 వేల మంది లైక్ చేశారు.