కుప్పంలో చంద్రబాబు టూర్‌కు అనుమతి నిరాకరణ
కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం కోసం 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పోలీసులు భారీగా మోహరించినా, కార్యకర్తలు భారీగా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఐతే కుప్పం నియోజకవర్గంలో బాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పర్యటనకు ఎందుకు అనుమతివ్వరని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకే రూల్స్ చెబుతారా అంటూ మండిపడ్డారు. కానీ, సమావేశాలకు అనుమతులు అవసరమని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు.

కొందరు పోలీసులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. కుప్పం పర్యటనకు వస్తానని నెల రోజుల ముందే షెడ్యూల్ ప్రకటించామన్నారు. డీజీపీకి లేఖ సైతం రాశామన్నారు. వైసీపీకి ఒక రూల్స్, టీడీపీకి మరో రూల్సా అంటూ ఆక్షేపించారు. శాంతియుతంగా ప్రజల సమస్యల వినడానికి వచ్చానన్న చంద్రబాబు పర్యటనకు ఎందుకు అనుమతివ్వరని పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్లపై సభలకు పర్మిషన్ లేదని… కుప్పం పర్యటనకు అనుమతి లేదంటూ పలమనేరు డీఎస్పీ చెప్పి వెళ్లిపోయారు. పోలీసుల నిర్ణయంపై కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. ప్రజల్లో టీడీపీకి వస్తున్న స్పందన చూసి జగన్ ప్రభుత్వానికి వెన్నులో వణుకుపుడుతోందని… నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకోవడమేంటని చంద్రబాబు మండిపడ్డారు.