వచ్చే ఎన్నికల్లో ప్రజలే టీడీపీకి సమాధి కడతారు: జోగి రమేష్
ఏపీ రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కాగా అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం హోరాహోరీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆయన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారని మంత్రి జోగి రమేష్ తెలిపారు. గురువారం 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని ఆయన వెల్లడించారు. కాగా ఏపీలో సీఎం జగన్ పేదల పక్షాన ఉన్నారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం పేదలు పేదలుగానే ఉండాలని పెత్తనం తమ చేతుల్లోనే ఉండాలనే స్వభావం ఉన్న వ్యక్తి అని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు అనే పెత్తందారీ కోటను బద్ధలుగొట్టామని, రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు అని జోగి దుయ్యబట్టారు.

చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా పేదలే గెలిచారని, హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా పేదల పక్షానే నిలబడ్డాయని, పేదల తరఫున పోరాటం చేసి విజయం సాధించామన్నారు. నయా పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఆరాటపడుతున్నారన్నారు. దీంతో పేదలకు భూములు ఇవ్వాలని ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. అమరావతిలో 50,793 మందికి రేపు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం ఇళ్ళు కట్టించి ఇస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు రాజధానిలో ఉంటే చంద్రబాబుకు అంటరానితనమా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు సమాధి అన్న ఆ సెంటు స్థలంలోనే పేదలు టీడీపీని సమాధి చేయనున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ పెద్ద ఎత్తున రేపటి కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి జోగి రమేష్ విజ్ఞప్తి చేశారు. పనికి మాలిన అమరావతి జేఏసీ ఏం చేస్తుంది? పేద వాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇవ్వొద్దని అడ్డుకుంటుందా? అని ప్రశ్నించారు. జగనన్న కాలనీల్లో 5 లక్షల ఇళ్ళు పూర్తి కానున్నాయని మంత్రి జోగి రమేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.