Andhra PradeshHome Page Slider

మంగళగిరిలో లోకేష్ పాదయాత్రకు పోటెత్తిన జనం

మంగళగిరి నియోజకవర్గంలో మంగళవారం లోకేష్ యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు మంగళగిరి చేరుకున్నారు. వేలాది మంది కార్యకర్తలు ప్రజలతో నిడమర్రు గ్రామం రోడ్డు కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ రాజకీయాల్లో జయాపజయాలు సహజమని 2019లో మంగళగిరి ఓటరు దేవుళ్లు నాపై కరుణ చూపలేదని, ఓడినా ప్రజలమధ్యే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారి వెన్నంటే ఉన్నానని అన్నారు. గత నాలుగేళ్లుగా అధికారపార్టీ చేయలేనన్ని కార్యక్రమాలను, వ్యక్తిగత నిధులతో చేపట్టానని, మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు జలధార వాటర్ ట్యాంకర్లు, వైద్యసేవలకు ఆరోగ్యరథాలు, ఆకలి తీర్చేందుకు అన్నాక్యాంటీన్లు, స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు కుట్టుమిషన్లు, చిరువ్యాపారులకు తోపుడుబళ్లు, చేనేతలకు రాట్నాలు, స్వర్ణకారులకు పనిముట్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు, పాదచారులు సేదదీరేందుకు సిమెంటు బల్లలు… ఇలాంటి 27సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నానని పేర్కొన్నారు. అధికారం చేపట్టిన జగన్ నాలుగేళ్లలో ఏమి చేశారో చెప్పాలని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు గత ప్రభుత్వం అమలుచేసిన 100 సంక్షేమ పథకాలను రద్దు చేశాడని, అన్నా క్యాంటీన్లు రద్దుచేసి పేదల నోళ్లు కొట్టాడని, బుల్డోజర్లు పంపించి రాత్రికి రాత్రే పేదల గూళ్లను కూల్చేశారని, 6లక్షల అవ్వాతాతల పెన్షన్లు తీసేసి పండుటాకుల ఉసురు పోసుకున్నారని అన్నారు. చేసిన పాపాలు కప్పిపుచ్చుకోవడానికి ప్యాలెస్ నుంచి బయటకు రావాలంటే వందలాది పోలీసులు, కిలోమీటర్ల పొడవున పరదాలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు.