Andhra PradeshNews

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ, రసవత్తరంగా రాజకీయం

అమరావతి, మనసర్కార్

◆ఐదేళ్ల తర్వాత కలుసుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్
◆ ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా నోవాటెల్ కు చేరుకున్న చంద్రబాబు
◆ బీజేపీతో కటీఫ్ దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. గడిచిన రెండు మూడు రోజులుగా రాజధాని అంశంపై ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పోటాపోటీ ధర్నాలు ర్యాలీలు సంఘీభావ యాత్రలు చేస్తు రాజకీయం వేడెక్కేలా చేశారు. వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమని వైసీపీ ఆధ్వర్యంలో విశాఖలో చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి మంత్రులపై ఎమ్మెల్యేలపై రాళ్ల దాడి చేయడం చెప్పులు విసరటం లాంటి చర్యలకు పాల్పడటంతో జనసేన కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతో పవన్ కళ్యాణ్ విశాఖలోనే ఉండి ప్రభుత్వం పై పలు విమర్శలు చేసి తమ కార్యకర్తలను వదిలి పెట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపి కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు. విశాఖపట్నంలో జనసేన పార్టీ తలపెట్టిన జనవాణి కార్యక్రమాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో విశాఖపట్నంలో సెక్షన్ 30 అమలులో ఉందని ఎవరు ఎలాంటి ర్యాలీలు కార్యక్రమాలు నిర్వహించకూడదని పోలీసులు పవన్ కళ్యాణ్ కు నోటీసులు అందజేయడంతో ఆయన సోమవారం విశాఖపట్నం నుండి బయలుదేరి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం చేరుకొని విలేకరుల సమావేశం నిర్వహించారు.

పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు దీటుగా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వ్యక్తిగత విమర్శలు చేయటంతో రాజకీయం మరింత వేడెక్కింది. దీంతో తగ్గేదే లేదని పవన్ కళ్యాణ్ మంగళవారం మంగళగిరిలోని జనసేన ప్రధాన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో భేటీ సందర్భంగా వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను ప్యాకేజీ అని ఎవరైనా మాట్లాడితే దవడ వాచిపోయేలా కొడతానని ,ఇంతకాలం తన సహనం అందర్నీ కాపాడిందని, బాపట్ల లో పుట్టా గొడ్డు కారం తిని పెరిగానని ,ఇంకోసారి ప్యాకేజీ అని మాట్లాడితే వైసీపీ నాయకులను చెప్పు తీసుకుని కొడతా అని హెచ్చరించారు. దీంతో ఆగకుండా సభ్యత, సంస్కారం ఉన్నవాళ్లం కాబట్టి మౌనంగా ఉన్నామని ,వైసీపీ గూండాల్లారా ఒంటిచేత్తో మెడ పిసికేస్తానని, తిట్టే ప్రతి వ్యక్తి తోలు ఒలిచేస్తాననీ ,వైసీపీతో యుద్ధానికి సై రాడ్లతోనా హాకీ స్టిక్కులతోనా దేంతో వస్తారో రండి తేల్చుకుందాం అని సవాల్ విసిరారు.

ఏపీ రాజకీయ ముఖ చిత్ర మారనుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ ప్రకటించిన వెంటనే ఆయన కీలక పరిణామానికి తెర తీశారు. విజయవాడలో చంద్రబాబు నాయుడుని పవన్ కలిశారు. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో మిత్రత్వాన్ని వదులుకుని, టీడీపీతో పొత్తు పెట్టుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత వారు కలవడం ఇదే తొలిసారి అవ్వటంతొ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చ మొదలైంది. కానీ విశాఖ లో జరిగిన పరిణామాలు, పోలీసుల చర్యలపైనే చంద్రబాబు సంఘీభావం తెలపటానికి వచ్చారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చేసిన కీలక వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీకి ఇక దూరంగా పవన్ కళ్యాణ్ ఉంటారని విశ్లేషకులు అంటున్నారు. ఇరువురి భేటీ అనంతరం వారు కేవలం పొత్తులపై మాట్లాడుతారా.. లేక ప్రస్తుతం పొత్తులపై ఎలాంటి ప్రకటన చేయకుండా ఉమ్మడి పోరాటం చేస్తామని ప్రకటిస్తారా చూడాల్సి ఉంది.