Andhra PradeshHome Page Slider

జనసేనలోకి రావాలన్న పవన్ కల్యాణ్… ఓ రేంజ్‌లో రిప్లై ఇచ్చిన వంగా గీత

పిఠాపురంలో అడుగుపెట్టిన జనసేనాని పవన్ కల్యాణ్
పిఠాపురం హీటెక్కుతోంది. రాజకీయాల్లో సంచలనాలు మాత్రమే నమోదవుతాయని, అనుకోవాల్సిన పనిలేదు. కొన్నిసార్లు అనూహ్యంగా గెలుపు ఓటములు నిర్ణయించబడతాయి. అందుకు నిదర్శనం స్టార్ డమ్ ఉన్న జనసేనాని భీమవరం, గాజువాక రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడమే. నాడు కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తుతో బరిలో దిగిన పవన్ కల్యాణ్ ఈసారి టీడీపీ-బీజేపీతో కలిసి పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి బరిలో నిలిచారు. పిఠాపురంలో గెలుపుపై పవన్ కల్యాణ్ దీమాగా ఉంటే.. అక్కడ్నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ వంగా గీత సైతం అంతే విశ్వాసంతో ఉన్నారు. ఇద్దరు నేతలు ఎన్నికల ప్రచారంలో హోరాహోరీ తలపడేందుకు సిద్ధపడుతున్న తరుణంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయ్.

వంగా గీత వైసీపీని వీడాలి: పవన్ కల్యాణ్
పిఠాపురం నుంచి బరిలో దిగుతానంటూ ప్రకటించిన తర్వాత పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగా గీత 2009లో తమ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఆమె అక్కడ ఉన్నారు. భవిష్యత్‌లో వైసీపీ వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నారు. పిఠాపురంలో మనిషికి లక్ష పంపించినా జనసేనే గెలుస్తుందని చెప్పారు. కాకినాడ పార్లమెంట్ కూడా తామే గెలుస్తామని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తంగా పిఠాపురం గడ్డపై అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ ప్రత్యర్థిని దెబ్బకొట్టే వ్యూహంలో ఈ వ్యాఖ్యలు చేశారని జనసైనికులు చెబుతున్నారు.

వైసీపీ నుంచి పవన్‌ను పోటీ చేయమంటే ఏమైనా బాగుంటుందా?
ఐతే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత తీవ్రంగా స్పందించారు. తాము ఇరువురం రెండు పార్టీల నుంచి పోటీ చేస్తున్నామని.. పవన్ కల్యాణ్‌ను వైసీపీలోకి రావాలని కోరితే ఏమైనా బాగుంటుందా.. అంటూ ఆమె ప్రశ్నించారు. రాజకీయంగా రెండు పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పుడు పోటీ గురించి, ఇష్యూల గురించి మాట్లాడాలన్నారు. ఎన్నకల్లో లక్షలు ఖర్చు పెడతారని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఓటరును ఎంత పవిత్రంగా చూడాలో తెలియదా అంటూ ప్రశ్నించారు. ఓటర్లను ఓట్లు, డబ్బుల కింద చూసే సంస్కారం మంచిదికాదన్నారు. అందుకే జగన్ పార్టీలు చూడకుండా అందరికీ పథకాలిచ్చారని, ఓట్ల సంగతి అసలు చూడలేదన్నారు.

డిగ్రీ చదివే రోజుల్లోనే రాజకీయాల్లో ఉన్నా…!
రాజకీయాలంటే సీరియస్ విషయమని పవన్ తెలుసుకోవాలని వంగా హితవు పలికారు. నియోజకవర్గంపై అవగాహనతో మాట్లాడాలన్నారు. ఇక తాను వారి ద్వారానే రాజకీయాల్లోకి వచ్చానన్న కామెంట్స్‌కు ఆమె హాట్ రిప్లై ఇచ్చారు. తాను 2009లో రాజకీయాలు ప్రారంభించలేదని… డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే రాజకీయాల్లో ఉన్నానన్నారు. తాను ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీల్లో బెస్ట్ క్యాడెట్ అని చెప్పుకొచ్చారు. సర్వీస్ అంటే ఇష్టం కాబట్టే రాజకీయాల్లో 20 ఏళ్ల వయసు నుంచే యాక్టివ్‌గా ఉన్నానన్నారు. 2009 మెగాస్టార్ చిరంజీవి టికెట్ ఇచ్చే సమయానికి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశానన్న ఆమె, తాను పీఆర్పీలోకి వచ్చే ముందు రాజ్యసభ సభ్యురాలిగా చేశానన్నారు. పవన్ కల్యాణ్‌ పబ్లిక్‌గా మాట్లాడేటప్పుడు విషయాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు.
తాను ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నానని… విజయం తనదేనన్నారు.

పిలిస్తే పలకబడును.. అడిగితే చేయబడును.. స్లోగన్ ఇదే..!
ఇప్పట్నుంచే దింపుడుకళ్లెం ఆశలెందుకంటూ పవన్ కల్యాణ్‌ను దెప్పిపొడిచారు వంగా గీత. మనిషికి లక్ష ఖర్చు పెడతారని చెప్పడం ద్వారా.. ప్రజలను అవమానిస్తున్నారన్నారు. ప్రజల మనసులు మెప్పించి ఓటు వేయించుకోవాలని… ఒకవేళ పవన్ కల్యాణ్ ఒక్కరే వస్తే.. తాను కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని ఒక్కదాన్నే వచ్చి కొట్లాడతానని సవాల్ విసిరారు. అందుకు మీరు సిద్ధామా అంటూ ఆమె ప్రశ్నించారు. పిఠాపురంలో పవన్ మెజార్టీ గురించి చర్చ జరగడం లేదని.. వంగా గీత మెజార్టీపైనే చర్చ జరుగుతోందన్నారు. పిలిస్తే పలకబడను.. అడిగితే చేయబడను అనే స్లోగన్‌తో ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు.

విజేతను నిర్ణయించేది సామాజిక సమీకరణలే… !?
మొత్తానికి పిఠాపురంలో ఎవరు గెలుస్తారన్నదానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. మెజార్టీ కాపు వర్గీయుల ఓట్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపుతాయన్న భావన ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ్నుంచి వైసీపీ అభ్యర్థిగా పెండెం దొరబాబు గెలిస్తే అంతకు ముందు ఇక్కడ్నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వర్మ గెలిచారు. అంతకు ముందు పీఆర్పీ నుంచి వంగా గీత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పిఠాపురంలో 28 శాతం వరకు కాపు ఓటర్లుండగా, తూర్పు కాపులు కూడా 10 శాతానికి పైగా ఉన్నారు. 19 శాతానికి పైగా మాల ఓటర్లు, శెట్టి బలిజలు 10 శాతం వరకు ఉండగా, చేనేతలు కూడా 10 శాతానికి కొంచెం అటూ ఇటూగా ఉన్నారు. మత్స్యకారులు, రెడ్డి, యాదవ, మాదిగలు గెలుపు ఓటములపై ప్రభావం చూపిస్తారు. ఇప్పటి వరకు నోటికి పదను పెట్టిన నేతలు, ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు పన్నుతారో చూద్దాం…