Andhra PradeshHome Page Slider

‘వారాహి అనే లారీ ఎక్కి ఊగిపోతూంటాడు పవన్’- జగన్

ఏపీ సీఎం జగన్ పార్వతీపురం జిల్లా కురుపాంలో  అమ్మఒడి పథకంలో లబ్దిదారుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. ఈసందర్భంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో మాట్లాడుతూ జనసేన నేత పవన్‌పై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు నీతి నిజాయితీ, మర్యాదలు లేవన్నారు జగన్. వారాహి అనే పేరున్న లారీని ఎక్కి ఊగిపోతూ వైసీపీ వారిని తిడుతున్నారని ఎద్దేవా చేశారు. నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ‘తాట తీస్తాననడం, తొడ గొట్టడం’, చెప్పుతో కొడతానంటున్న మనిషికి ఏమైనా మర్యాద ఉందా? అని ప్రశ్నించారు. పవన్‌ పెళ్లిళ్లపై కూడా విమర్శించారు జగన్. నాలుగు పెళ్లిళ్లు చేసుకుని పెళ్లి అనే బంధాన్ని రోడ్డుమీదకు తెచ్చారన్నారు. ఇలాంటి పనులు మనం చేయలేమని, అది వారికే పేటెంట్ హక్కని అన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్ మీసాలు మెలేస్తూ వార్నింగులు ఇస్తూ రౌడీయిజం ప్రదర్శిస్తున్నాడని మండిపడ్డారు జగన్. ఈ సభలో అమ్మఒడి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలలో 13 వేల రూపాయల చొప్పున జమ చేశారు. 1 వతరగతి నుండి ఇంటర్ వరకు చదువుకునే 42,61,965 మంది విద్యార్థులకు ఈ లబ్ది జరుగుతున్నట్లు జగన్ చెప్పారు. వారి ఖాతాలలో మొత్తం 6,393 కోట్ల రూపాయలు జమ చేసినట్లు చెప్పారు.