వీకీపీడీయాను బ్లాక్ చేసిన పాకిస్తాన్! ఎందుకంటే?
పాకిస్థాన్ వికీపీడియాను ” దైవ దూషణాత్మక కంటెంట్”పై బ్లాక్ చేసింది. ప్లాట్ ఫామ్ నుంచి సున్నితమైన కంటెంట్ తొలగించాలని పాకిస్తాన్ టెలికాం అథారిటీ (PTA) వికీపీడియా సేవలను 48 గంటలపాటు తగ్గించిన తర్వాత కూడా వికీపీడియా స్పందించకపోవడంతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకొంది. అభ్యంతరకరమైన, దైవదూషణ విషయాలను తొలగించడానికి వెబ్‌సైట్ నిరాకరించడం వల్లే బ్లాక్ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. PTA ప్రతినిధిని సంప్రదించగా… వికీపీడియాను బ్లాక్ చేయడం గురించి అడగ్గా… బ్లాక్ చేసింది నిజమేనని స్పష్టం చేశారు. నోటీసు జారీ చేయడం ద్వారా పేర్కొన్న కంటెంట్‌ను నిరోధించడం/తొలగించడం కోసం వికీపీడియాను సంప్రదించినట్లు PTA ప్రతినిధి పేర్కొన్నారు. దైవదూషణ కంటెంట్‌ను తీసివేసేందుకు అంగీకరించలేదని అధికారులు చెప్పారు.

PTA ఆదేశాలను పాటించడంలో ప్లాట్‌ఫార్మ్‌లో విఫలమైనందున, తొలుత సేవలను తగ్గించిన PTA ఆ తర్వాత బ్లాక్ చేయాలని నిర్ణయించింది. చట్టవిరుద్ధమైన కంటెంట్ బ్లాక్ చేసిన తర్వాత వికీపీడియా సేవల పునరుద్ధరణ పునఃపరిశీలించబడుతుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు దైవదూషణగా భావించిన కంటెంట్‌పై గతంలో బ్లాక్ చేశాయి. ముస్లింలు మెజారిటీగా ఉన్న పాకిస్థాన్‌లో దైవదూషణ అనేది ఒక సున్నితమైన అంశం. వికీపీడియా అనేది ఒక ఉచిత ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సేవకుల సేవల ఆధారంగా వికీమీడియా ఫౌండేషన్ ద్వారా పనిచేస్తుంది.

