ఆపరేషన్ ‘అదుర్స్’, మూవీ చూపిస్తూ పేషెంట్‌కు బ్రెయిన్ సర్జరీ
కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జిజిహెచ్) వైద్యులు జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాని ప్రదర్శిస్తూ “అవేక్ క్రానియోటమీ” ద్వారా మహిళా రోగి నుండి బ్రెయిన్ ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించారు. క్రిటికల్ నాడులు దెబ్బతినకుండా ఇలాంటి సర్జరీ చేయడం ఆస్పత్రిలో ఇదే తొలిసారి. తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎ. అనంతలక్ష్మి అనే 55 ఏళ్ల రోగి కుడి చేయి, కాలు బలహీనత లక్షణాలతో బాధపడేది. అనేక ప్రైవేట్ ఆసుపత్రులు వెళ్లింది. చికిత్సకు పెద్ద ఎత్తున డబ్బులు కావాల్సి ఉండటం, కష్టమైంది కావడంతో ఆమె బాధలు ఎక్కువయ్యాయి. తలనొప్పి, మూర్ఛ, శరీరం కుడి వైపు అంతా తిమ్మిరితో బాధపడుతూ సెప్టెంబర్ 11 న GGH లో చేరింది. ఆమె మెదడుకు ఎడమవైపున 3.3 x 2.7 సెం.మీ కణితిని వైద్యులు కనుగొన్నారు.

మంగళవారం వైద్యబృందం సీనియర్ వైద్యులు, మత్తు వైద్యుల ఆధ్వర్యంలో కొద్దిపాటి మత్తులో అనంతలక్ష్మిని నిద్రలేపి శస్త్ర చికిత్స చేశారు. ఆమెకు సౌకర్యవంతంగా ఉండటంతోపాటు, మరో లోకంలో ఉండేలా చేసేందుకు డాక్టర్లు జూనియర్ ఎన్టీఆర్, బ్రహ్మానందం నటించిన అదుర్స్‌లోని ఆమెకు ఇష్టమైన హాస్య సన్నివేశాలను ట్యాబ్ ద్వారా చూపించారు. ఆమె సినిమా చూస్తున్న సమయంలో రోగికి ప్రక్రియ గురించి తెలియకుండా ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగింది. చికిత్స తర్వాత రోగి లేచి కూర్చుని అల్పాహారం తీసుకోగలిగడం విశేషం. ఐదు రోజుల్లో ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఈ రకమైన శస్త్రచికిత్స మొదటిసారిగా GGHలో చేశామన్నారు డాక్టర్ లావణ్యకుమారి. ప్రక్రియ సమయంలో రోగులు మెలకువగా ఉండి, వైద్యుల ప్రశ్నలకు ప్రతిస్పందించడం ద్వారా, నరాలు దెబ్బతినకుండా చూసుకోవచ్చని అనస్థీషియాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎ. విష్ణువర్ధన్, న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ విజయశేఖర్ వివరించారు.

మెలుకువగా ఉండి బ్రెయిన్ సర్జరీ చేయడమేంటి?
మేల్కొని మెదడు శస్త్రచికిత్స, దీనిని మేల్కొని క్రానియోటమీ అని కూడా పిలుస్తారు. ఇది రోగి మెలకువగా, అప్రమత్తంగా ఉన్నప్పుడు చేసే ప్రక్రియ. ఇది ప్రధానంగా మెదడు కణితులు లేదా మూర్ఛ వంటి నాడీ సంబంధిత పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఆపరేషన్ సమయంలో క్లిష్టమైన విధులను పర్యవేక్షించడానికి సర్జన్లను అనుమతిస్తుంది.
రోగి ఎందుకు మేల్కొని ఉండాలి?
దృష్టి, కదలిక, ప్రసంగానికి బాధ్యత వహించే మెదడులోని కీలక ప్రాంతాలను దెబ్బతీయకుండా వైద్య బృందానికి సహాయం చేయడానికి శస్త్రచికిత్స సమయంలో రోగి స్పృహలో ఉంచాల్సి ఉంటుంది. ప్రక్రియ సమయంలో ప్రతిస్పందనలు సర్జన్ సరైన ప్రాంతానికి చికిత్స చేస్తున్నాయని నిర్ధారించడంలో సహాయపడతాయి. ఇది ఫంక్షనల్ ప్రాంతాలకు నష్టం కలిగించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అవేక్ క్రానియోటమీ ఎప్పుడు అవసరం?
కణితి లేదా మూర్ఛ దృష్టి అవసరమైన మెదడు ప్రాంతాలకు సమీపంలో ఉన్నప్పుడు ఈ సాంకేతికత ఉపయోగించబడుతుంది. దృష్టి, మోటారు నైపుణ్యాలు లేదా ప్రసంగాన్ని నియంత్రించే విభాగాలు ప్రమాదంలో ఉన్నట్లయితే, శస్త్రచికిత్స సమయంలో రోగితో కమ్యూనికేట్ చేయగలగడం సర్జన్ ఈ కీలక ప్రాంతాలను గుర్తించి రక్షించడంలో సహాయపడుతుంది.
శస్త్ర చికిత్స ఎలా పని చేస్తుంది?
శస్త్ర చికిత్స చేసే సమయంలో, రోగి తేలిక మత్తులో ఉంటాడు. కానీ మెలకువగా ఉంటాడు. సర్జన్ ప్రశ్నలకు రోగితో సమాధానం ఇవ్వమని లేదా సాధారణ కదలికలను చేయమని కోరతారు. ముఖ్యమైన మెదడు మార్గాలకు ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రమాదాలను తగ్గిస్తుంది. ప్రభావిత ప్రాంతాన్ని కచ్చితంగా లక్ష్యంగా చేసుకోవడంలో సర్జన్‌కి సహాయపడుతుంది.

ఇలాంటి సర్జరీ ఎలా చేస్తారు?
మెదడులోని కణితి లేదా మూర్ఛను కలిగించే విభాగాన్ని తొలగించాల్సిన అవసరం వచ్చినప్పుడు మేల్కొని ఉంటూనే మెదడు శస్త్రచికిత్సను వైద్యులు చేస్తారు. భవిష్యత్ లో మాట్లాడేందుకు ఇబ్బందుల్లోకుండా, రాసేందుకు సమస్యలు రాకుండా, పనులు చేసుకునేందుకు ఇబ్బందులు రాకుండా మెదడుపై ప్రభావం చూపే ఏరియాలకు సమస్యల రాకుండా వైద్యులు మెల్కొని ఉండే చికిత్స చేస్తారు. శస్త్రచికిత్సకు ముందు ఆయా ప్రాంతాలను గుర్తించడం కష్టం కాబట్టి, మేల్కొని ఉన్న క్రానియోటమీ శస్త్రచికిత్స నిపుణుడు కచ్చితంగా గుర్తించి వాటికి చికిత్స అందిస్తారు. క్లిష్టమైన విధులను బలహీనపరిచే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.