ఈ నెల 14న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ
• 34 ఎకరాల్లో సభకు విస్తృత ఏర్పాట్లు
• వారాహి వాహనంలో సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ రాక
ఏపీలో కృష్ణాజిల్లా మచిలీపట్నం వేదికగా జనసేన పదో ఆవిర్భావ సభ ఈనెల 14వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు కోసం వైయస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజల్ని కంకణ బద్ధుల్ని చేసే వేదికగా ఈ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా ల నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు పేరిట సభా వేదికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పింగళి వెంకయ్య, నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగాలను స్మరించుకునే దిశగా సభాప్రాంగణం ఉంటుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో హాజరై క్యాడర్ కు ప్రజలకు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ పై దిశా నిర్దేశం చేస్తారని వెల్లడించారు. వైఎస్ఆర్సిపీ విముక్తా ఆంధ్ర ప్రదేశ్ కోసం ఇప్పటికే పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ ఓటు చీల నివ్వనని ప్రకటించారని దీనిలో భాగంగా ఆయన ప్రసంగం ఉంటుందని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ కోసం రైతులు ముందుకు వచ్చారని 34 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే అందించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. మచిలీపట్నానికి కిలోమీటర్ దూరంలో జాతీయ రహదారిపై ఈ సభావేదిక ఉంటుందని మనోహర్ వెల్లడించారు. రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయటం లేదని అయితే తమ అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైయస్సార్సీపీని ఓడించటమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.