NewsTelangana

ఒకటిన మునుగోడు గప్‌చుప్‌.. ప్రచారానికి తెర

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ప్రచార హోరు నిలిచిపోయి మైకులు మూగబోనున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పర్వానికి తెర లేవనుంది. ఆ తర్వాత ఓటు హక్కు లేని బయటి వాళ్లు మునుగోడులో ఉండకూడదని ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ స్పష్టం చేశారు. మునుగోడులో 2.41 లక్షల ఓటర్లు ఉన్నారని.. 298 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. పోలింగ్‌ స్టేషన్లు అర్బన్‌ ప్రాంతంలో 35, రూరల్‌లో 263 ఉన్నాయని.. కొత్త కార్డులు ఇచ్చామని తెలిపారు. 105 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని.. అక్కడ నిఘా, అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామని వివరించారు.

ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌..

ఈ ఎన్నికల సందర్భంగా మునుగోడులో వివిధ రాజకీయ పార్టీల నుంచి 479 ఫిర్యాదులు అందాయని.. ఇప్పటి వరకు 185 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. నియోజక వర్గంలో పర్యవేక్షణకు 199 మందితో ప్రత్యేక బృందాలను నియమించామని.. పోలీసులు అణువణువూ తనిఖీలు చేస్తారని చెప్పారు. నవంబరు 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. 3,366 మంది పోలింగ్‌ సిబ్బందిని.. 15 బలగాల పోలీసులను మునుగోడులో మోహరించామని.. 50 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లతో కలిపి 50 బృందాలు నిరంతర పర్యవేక్షణలో ఉంటాయన్నారు.