సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌తో విచారణకు ఓకే
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనే అవసరం తమకు లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదంతా ఒక నాటకాన్ని తలపిస్తోందని.. తమ వద్ద అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. వాళ్లు రూ.100 కోట్ల ఖరీదైన వ్యక్తులా..? అని ఎద్దేవా చేశారు. వ్యాపారి నందకుమార్ ఎవరో తనకు తెలియదని, ఆ పేరు ఇప్పుడే వింటున్నానని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సీబీఐతో మాత్రమే కాదు.. సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితోనూ విచారణకు తాము సిద్ధమేనని చెప్పారు. ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయని.. ఇప్పుడు ఎమ్మెల్యేలను ఎందుకు కొంటామని ప్రశ్నించారు.

ఫాం హౌస్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేదే..
తాము కొనుగోలుకు ప్రయత్నించామని చెబుతున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ కుటుంబానికి వ్యాపార సంబంధాల్లో దగ్గరి వ్యక్తులేనని.. వాళ్లు బీజేపీలోకి ఎందుకొస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ తరఫున మాట్లాడేందుకు ఆ ముగ్గురు ఎవరని.. తమకు ఏ విషయమూ తెలియకుండా బీజేపీ తరఫున వాళ్లు హామీ ఎందుకిస్తారని నిలదీశారు. అంతెందుకు.. బేరసారాలు జరిగాయని చెబుతున్న ఫాంహౌస్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు చెందినదేనని.. ఎమ్మెల్యేలను కొనాలనుకుంటే అక్కడ బేరసారాలు ఎలా చేస్తారని.. ఈ వార్తలు చూసి ప్రజలు నవ్వుకుంటారని ఎద్దేవా చేశారు.