సీఎం పీఠం కాదు… సింగిల్ డిజిట్ తెచ్చుకోండి చూద్దాం… అమిత్ షాకు హరీష్ కౌంటర్
ఖమ్మం సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఎవరో రాసిన స్క్రిప్ట్ ఆధారంగా అమిత్ షా కేసీఆర్‌పై విమర్శలు చేశారని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఖమ్మం సభపై హరీష్ ట్వీట్ చేశారు. నూకలు మాకు చెల్లడం కాదు, తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పీయూష్ గోయల్ వెక్కిరించినప్పుడే తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లిపోయాయన్నారు. బ్యాట్ సరిగ్గా పట్టుకోవడం చేతగాని నీ కుమారుడికి ఏకంగా, బీసీసీఐలో కీలక పదవి ఎలా వచ్చిందో అందరికీ తెలుసునన్నారు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడడం, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ దెప్పిపొడిచారు. దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే రైతు చట్టాలను ఉపసంహరించుకున్నారని… రైతుబాంధవుడు కేసీఆర్‌ను విమర్శిస్తే ఒరిగేదేం లేదన్నారు. 2g, 3g, 4g, పాలన కాదని కేంద్రంలో నాజీలను మించిన నియంతృత్వ పాలన సాగుతోందంటూ నిప్పులు కురిపించారు. వచ్చే ఎన్నికల తర్వాత మాజీలు అయ్యేది మీరేనని, తెలంగాణలో సీఎం పదవి కాదు… కనీసం సింగల్ డిజిట్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలంటూ హితవు పలికారు.