రెప్పపాటులో నేలమట్టం
ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు అక్రమంగా నిర్మించిన నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్లను కూల్చివేశారు. అనుకున్న సమయానికే భవనాలు నేల మట్టాయి. 12 సెకన్ల వ్యవధిలోనే టవర్ కుప్పకూలింది. దీంతో 100 మీటర్ల వరకు దట్టంగా దుమ్ము, ధూళీ కమ్మేసింది. ఈ క్రమంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు 3 వేల 700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు. వీటికి రెండు వేల వరకు కనెక్షన్లు ఇచ్చారు. భవనాల పిల్లర్లలో 7 వేల రంధ్రాలు చేశారు. 20 వేల సర్క్యూట్లు ఏర్పాటు చేశారు. వాటర్ ఫాల్స్ ఇంప్లోజన్ టెక్నాలజీ ఉపయోగించి.. భవనాలను నిట్టనిలువుగా పడగొట్టారు. ఈ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పక్కన ఉండే భవనాలకు నష్టం కలగలేదు. ఉన్న చోటే… నిట్టనిలువుగా పడిపోయాయి. ఎడిపైస్ సంస్థ, నోయిడా అధికార యంత్రాంగం, పోలీసులు కలిసికట్టుగా పనిచేసి… ఈ ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు.

సెక్టార్ 93Aలోని రెండు భారీ టవర్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని విచారణలో నిర్ధారణయ్యింది. ఒక్కో టవర్లో 40 అంతస్తులు నిర్మించాలని ప్లాన్ చేశారు. కోర్టు అనుమతులు నిలిపేయడంతో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఏపెక్స్ టవర్ 32 అంతస్తులు కాగా… సియాన్ టవర్ 29 అంతస్తులు మేర నిర్మించారు. మొత్తం 900 అపార్ట్మెంట్లు నిర్మించాలని ప్లాన్ చేశారు. వాటిలో మూడొంతలు ఇప్పటికే అమ్మడం గానీ… బుక్ కావడం గానీ జరిగింది. ట్విట్ టవర్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులకు నష్టం వాటిల్లకుండా కోర్టు తీర్పు చెప్పింది. ఎవరైతే ఫ్లాట్లు కొనుగోలు చేశారో వారందరికీ వడ్డీతో సహా మొత్తాన్ని తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.