జగన్నుఅడ్డుకోవడం ఎవరి తరం కాదు: సజ్జల
ఏపీలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని చూసి మరోసారి అధికారం కట్టబట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ రోడ్డు మ్యాప్ ఇవ్వకపోయినా పోరాడతానని చెబుతున్న, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ , చంద్రబాబును నిలదీయకుండా ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్, డైలాగులు చెబుతున్నారని విమర్శించారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెబుతున్న పవన్ ప్రతిపక్ష నేత చంద్రబాబును తెలుగుదేశం పార్టీని ఎందుకు ప్రశ్నించడం లేదో తెలపాలన్నారు. వైసీపీ అధికారంలోకి రాదని నిర్ణయించటానికి చంద్రబాబు, పవన్ ఎవరన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ప్రజల్లో విశ్వసనీయత ఏమాత్రం చెక్కుచెదరలేదని అన్నారు. తాము అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు.

పవన్ ఒక్కోసారి ఒక రకంగా మాట్లాడుతారని ఆయనకు ఓ అజెండా లేదని ఒకసారి కులమంటారు, మరోసారి కులం అవసరం లేదంటారు. మరోసారి బీజేపీ రోడ్డు మ్యాప్ అడిగారు, ఆ తర్వాత రోడ్డు మ్యాప్ ఇవ్వకపోయినా తానే పోరాడుతానని అంటారు ఇన్ని అంటున్నా ఆయన తెలుగుదేశం పార్టీని మాత్రం పల్లెత్తు మాట అనకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో తేల్చకుండా 175 స్థానాలకు అభ్యర్థులు లేకుండా ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో కేఏ పాల్ రావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకెవరైనా రాష్ట్రంలోకి రావచ్చని చమత్కరించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించటం దాన్ని క్యాష్ చేసుకోవాలి అనుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఇందులో భాగంగానే మాచర్ల ఘటనని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు మాచర్ల ప్రశాంతంగా ఉందని జూల కంటి బ్రహ్మారెడ్డి తిరిగి రావడంతో అల్లర్లు జరిగాయన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని వారి సమస్యలన్నీ పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.