భారత భూమిని ఎవరూ తీసుకోలేరు, చైనాకు అమిత్ షా వార్నింగ్
అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ‘భారత ప్రాదేశిక సమగ్రతను’ ఎవరూ ప్రశ్నించలేరని హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత భూమిని ఎవరూ ఆక్రమించలేరన్నారు. 2014కి ముందు ఈశాన్య ప్రాంతమంతా అస్తవ్యస్తంగా ఉండేదని, అయితే గత 9 ఏళ్లలో ప్రధాని మోదీ ‘లూక్ ఈస్ట్’ విధానం కారణంగా ఈశాన్య ప్రాంతం దేశాభివృద్ధికి దోహదపడే ప్రాంతంగా పరిగణించబడుతుందన్నారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు గ్రామం కిబితూ నుండి ‘వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్’ ను షా ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ దేశానికి అత్యంత కీలకమైన రాష్ట్రమని.. స్థానిక ప్రజల అభివృద్ధి కోసం కేంద్రం పనిచేస్తూనే ఉంటుందని ఆయన చెప్పారు. సైన్యాన్ని, సరిహద్దు పోలీసులను కొనియాడుతూ.. ‘‘మన ఐటీబీపీ జవాన్లు, సైన్యం సరిహద్దుల్లో పగలు, రాత్రులు శ్రమిస్తున్నందున ఈరోజు దేశ ప్రజలందరూ ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారన్నారు. భారతదేశం భూమిని ఎవరైనా ఆక్రమించగలిగే పరిస్థితులు గతంలో ఉన్నవేమోకానీ ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదన్నారు. ITBP, ఇండియన్ ఆర్మీ ఉన్నందున, మన భూమిని ఎవరూ ఆక్రమించలేరని గర్వంగా చెప్పగలమన్నారు.