Andhra PradeshHome Page Slider

ఎన్‌ఎంసి కొత్త నిబంధనలను సరిచేయాలి

ఢిల్లీ: జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసి) కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలతో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం వాటిల్లుతోందని, పాత విధానాన్నే కొనసాగించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని బుధవారం ఆమె కలిశారు. ప్రతి 10 లక్షల మందికి 100 మెడికల్ సీట్లు, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు 605 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి ఉండాలనే నిబంధనలతో ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని కేంద్రమంత్రికి ఆమె వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత సేవారంగంలో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. దీనిని అధిగమించడానికి రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు నిర్మిస్తున్నాం. వాటిలో ఇప్పటికే 5 పూర్తయ్యాయి. అయితే ఎన్‌ఎంసీ తాజా నిబంధనలతో రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల కూడా కొత్తగా మంజూరయ్యే అవకాశమే ఉండదని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఏపికి ఎలాంటి నష్టం రాకుండా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. తమ విజ్ఞప్తి మేరకు ఆయన సానుకూలంగా స్పందించారని రజిని తెలిపారు.