InternationalNews

కాంగోలో కూలిన కొత్త బ్రిడ్జ్..వీడియో వైరల్

డెమొక్రటిక్ రిపబ్లిక్  కాంగోలో అక్కడి అధికారులు ఇటీవల కొత్తగా ఒక వంతెనను నిర్మించారు. కాంగోలో వర్షాకాలంలో నదిని దాటేందుకు వీలుగా అధికారులు ఒక వంతెనను నిర్మించాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా అధికారులు ఆ వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు.  అయితే కొన్ని రోజుల్లోనే ఆ వంతెన నిర్మాణ పనులు మొత్తం పూర్తి చేశారు. దీంతో ఆ వంతెనను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించుకున్నారు.ఈ మేరకు అధికారులు ప్రారంభోత్సవానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.

అంతేకాకుండా వంతెన  ప్రారంభోత్సవ కార్యక్రమానికి అక్కడి అధికారులు, రాజకీయనేతలను ఆహ్వానించారు. దీంతో అందరూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. వంతెనను ప్రారంభించాల్సిన సమయం రానే వచ్చింది. కాగా అతిధులందరూ.. వంతెనను ప్రారంభించడానికి బ్రిడ్జిపైకి ఎక్కారు. అనంతరం రిబ్బన్ కట్ చేయగానే..వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఊహించని ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈ సమయంలో తీసిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రారంభోత్సవంలోనే ఈ వంతెన కూలిపోయిందంటే వంతెన నిర్మాణంలో ఎంతటి నాణ్యత పాటించారో తెలిసిపోతోందని ఓ నెటిజన్ వ్యంగ్యంగా స్పందించారు. మరోవైపు మిలియన్లకొద్దీ ప్రజా ధనాన్ని నేలపాలు చేశారంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.