జగన్‌కు నెల్లూరు జిల్లా తలనొప్పి
• ఒకరి తర్వాత ఒకరు అధిష్టానం తీరుపై ఆగ్రహం
• మొన్న ఆనం.. నిన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నేడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
• స్వయంగా రంగంల్లోకి దిగిన సీఎం జగన్
• తాడేపల్లికి చేరిన నెల్లూరు జిల్లా పంచాయతీ
ఏపీలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెల్లూరు జిల్లాలో శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే ఫోన్ టాపింగ్ జరుగుతుందని అధిష్టానం పై ధ్వజమెత్తిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అందుకు సంబంధించి సాక్షాలను మీడియా ముందు బయట పెట్టారు. అంతకు ముందే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నేపథ్యంలో తాజాగా నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అధిష్టానం నియమించిన నియోజకవర్గ పరిశీలకుడు ధనుంజయ రెడ్డి తీరుపై నిప్పులు చెరుగుతూ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానంటూ రచ్చకెక్కారు. దీంతో రాష్ట్ర స్థాయిలో ప్రకంపనాలు జగన్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే ఫోన్ టాపింగ్ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతుంది.

నిన్నా, మొన్నటి వరకు నెల్లూరు జిల్లాలో బలంగా ఉన్న అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య చోటు చేసుకుంటున్న వివాదాలతో ఆ పార్టీ బలహీనపడుతుంది. దీంతో పార్టీ శ్రేణులతో పాటు జగన్‌లో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ కు సంబంధించి బుధవారం సాక్షాలను మీడియా ముందు పెట్టారు. అంతటితో ఆగకుండా మరో 35 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రుల ఫోన్లు కూడా టాపింగ్ జరుగుతున్నాయని స్వయంగా వారే తనకు ఫోన్ చేసి చెప్పారని మరో బాంబు పేల్చారు. ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేసేందుకు అధిష్టాన పెద్దలు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. నష్ట నివారణ చర్యలకు సిద్ధమయ్యారు.

ఈలోపే అదే జిల్లాకు చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరో బాంబు పేల్చారు. ఉదయగిరి పరిశీలకుడు ధనుంజయ రెడ్డి వ్యవహార శైలి బాగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు తమ అసహనాన్ని వ్యక్తపరుస్తుండటం ఆ జిల్లా పార్టీ శ్రేణులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇదిలా ఉండగా బుధవారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ కు సంబంధించిన సాక్షాన్ని బయటపెట్టి ప్రభుత్వ పెద్దలకు కొత్త సవాల్ విసిరారు. దీంతో టాపింగ్ వ్యవహారం ప్రతిపక్షానికి అస్త్రంగా మారకముందే నెల్లూరు రూరల్ వివాదాన్ని పరిష్కరించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆదిశగా జిల్లాకు చెందిన నేతలను తాడేపల్లికి పిలిపించి సమావేశమయ్యారు. అలాగే హోం శాఖ కార్యదర్శి ఇంటిలిజెన్స్ ఐజిీలతోను సమావేశమై టాపింగ్ వ్యవహారంపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే నెల్లూరు రూరల్ కు దీటైన ఇన్చార్జిను నియమించాలని భావిస్తున్న జగన్… జిల్లాకు చెందిన ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్నారు.

మొదట ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, పేర్లను పరిశీలించిన అధిష్టాన పెద్దలు బుధవారం అనూహ్యంగా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు తాత్కాలికంగా ఇన్చార్జి పగ్గాలు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. అంతకుముందు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పేరుని కూడా పరిశీలించారు. అయితే నెల్లూరు సిటీ, రూరల్ రెండు నియోజకవర్గాలను బీసీలకు అప్పగిస్తే బలమైన రెడ్డి సామాజిక వర్గం దూరమయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచనలు నేపథ్యంలో బీసీలకు ఇవ్వాలా? రెడ్లకు బాధ్యత ఇవ్వాల అనే అంశంపై గురువారం మరోసారి చర్చించి నిర్ణయం తీసుకొని ఇన్చార్జిను ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఏది ఏమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకరి తరువాత ఒకరు నేతలు అధిష్టానంపై వ్యతిరేకత ప్రదర్శిస్తూ ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.