జైలు నుండి నేడే నవజ్యోత్ సింగ్ సిద్దూ విడుదల
పది నెలల కారాగార శిక్ష అనంతరం పంజాబ్ కాంగ్రెస్ లీడర్, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాటియాలా జైలు నుండి విడుదల కాబోతున్నారు. ఆయనకు ఘన స్వాగతం చెప్పేందుకు సిద్దూ మద్దతుదారులు, కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు పాటియాలా జైలు బయట వేచి ఉన్నారు. సిద్ధూ విడుదల తమకు పండగ వంటిదని వారు పేర్కొన్నారు. పాటియాలా సిటీలో సిద్ధూ పోస్టర్లు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఒక సంవత్సరం పాటు జైలుశిక్ష పడిన సిద్ధూకి సత్ప్రవర్తన కారణంగా రెండు నెలల శిక్ష తగ్గి, 10 నెలలకే బయటకు వస్తున్నారు. 1988లో నవజ్యోత్ సింగ్, అతని స్నేహితుడు 65 ఏళ్ల గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో గొడవపడి గాయపరిచిన కారణంగా అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతని మరణానికి ప్రత్యక్ష కారణం కాకపోయినా పరోక్ష సంబంధం ఉండడం వల్ల 2018లో సుప్రీం కోర్టు అతనికి వెయ్యిరూపాయల జరిమానా, ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఈ రోజు మధ్యాహ్నం నవజ్యోత్ సింగ్ సిద్దూ మీడియాను ఉద్దేశించి మాట్లాడతారని ట్విటర్‌లో తెలియజేశారు.