Andhra PradeshHome Page Slider

అసలు నారా లోకేశ్ స్థాయేంటన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

•రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
•కుంచన పల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎస్సీ కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవం

ఏపీలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీల అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ను విమర్శించే అర్హత, స్థాయి నారా లోకేష్ కు లేదని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. నగర పరిధిలోని కుంచనపల్లిలో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎస్సీ కమ్యూనిటీ హాలును మంగళవారం రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ కుంచనపల్లిలో పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలతో అతి స్వల్ప కాలంలో సుమారు రూ.1.50 కోట్లతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు.

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గురించి నారా లోకేష్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి రహిత పాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటినుండి రాష్ట్రంలో కుల, మత, వర్గ, ప్రాంత భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని గుర్తు చేశారు. సమ సమాజ స్థాపన కోసం రాజ్యాంగాన్ని రచించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ ఎవ్వరూ చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.