Andhra PradeshHome Page Slider

కాకినాడ యువతి హత్యకేసులో ప్రేమోన్మాది సంచలన వ్యాఖ్యలు

కాకినాడ యువతి లీలా పవిత్రను బెంగళూరులో కర్కశంగా కత్తితో పలుమార్లు ప్రేమికుడు దినకర్ పొడిచి చంపిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యకు ఎందుకు పాల్పడ్డాడో అతను వెల్లడించిన విధానం సమాజంలోని యువత పతనావస్థకు అద్దం పడుతోంది. అతనిది ఎంత పైశాచిక ప్రేమో అర్ధం అవుతోంది. ప్రేమించిన యువతి తనకు దక్కదని కసితీరా పొడిచి చంపిన అతని మనస్తత్వం ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ప్రేమ త్యాగాన్ని కోరుతుందని, ప్రేమించిన వారి సుఖసంతోషాలను కోరుతుందనే భావన ఇప్పటి యువతరంలో లేదు. ప్రేమించింది తనకు దక్కకపోతే వేరెవ్వరికీ దక్కకూడదు, చంపేస్తాం లేదా  నాశనం చేసేస్తాం అనే ఉన్మాదస్థితికి చేరుకుంటున్నారు.

దినకర్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం, రెల్లివలసకు చెందిన వ్యక్తి. విశాఖపట్నంలో ఎమ్మెస్సీ చదివే రోజుల నుండీ ఇద్దరూ ప్రేమించుకున్నారని, ఐదేళ్ల క్రితం బెంగళూరులో ఉద్యోగంలో చేరామని తెలిపాడు. కులాల కట్టుబాట్లు దాటి పెళ్లికి ఆమె పెద్దలు ఒప్పుకోలేదని, దీనితో సహజీవనానికి గానీ, పెళ్లికి గానీ ఆమెపై ఒత్తిడి చేసేందుకు ప్రయత్నించానని పేర్కొన్నాడు. తన ప్రతిపాదనలను తిరస్కరించిందని, ఆమెకు పెద్దలు వివాహం నిశ్చయం చేశారని, ఆకోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డానన్నాడు. ఆమె లేని జీవితాన్ని ఊహించలేక విపరీత మానసిక కుంగుబాటుకు లోనయ్యానని, ఆమె వేరొకరికి భార్య కావడం తట్టుకోలేని విషయం అనీ  పోలీసు విచారణలో వెల్లడించాడు.

జీవనబీమానగర పోలీసు అధికారులు హత్య జరిగిన సంఘటన ప్రదేశాన్ని పలుమార్లు పరిశీలించారు. ఆమె పనిచేసే ఆఫీసులో విచారించారు. అతనెప్పుడైనా కార్యాలయానికి వచ్చాడా, పవిత్రతో మాట్లాడినట్లు తెలిసిందా అనే విషయాలు సేకరించారు. ఇక దినకర్ ఆఫీసుకు కూడా వెళ్లి అతని ప్రవర్తనపై ఆరా తీశారు. దినకర్‌ను నగర మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన పిదప, పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. లీలా పవిత్ర మృతదేహానికి కుటుంబ సభ్యులు బెంగళూరులోనే అంత్యక్రియలు నిర్వహించారు.