Home Page SliderTelangana

త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు.. రంగం సిద్ధం చేస్తున్న అధికారులు.

మున్సిపల్ ఎన్నికలకు రాష్ర్ట ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇటీవల కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు వీటిలో విలీనం అయిన గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డులు, డివిజన్ల పునర్విభజనపై మున్సిపల్ శాఖ అధికారి శ్రీదేవి జీవో జారీ చేశారు.

కొత్త మున్సిపాలిటీలలో వార్డుల విభజనకు కసరత్తు చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు, 5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. 7 మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు విలీనం అయ్యాయి. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో వార్డుల విభజన ప్రక్రియకు మున్సిపల్ శాఖ అధికారి శ్రీదేవి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 21 వరకు వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లో, పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితాను తయారు చేసింది. ఎంపీటీసీల విభజన, ఓటరు జాబితాను సిద్ధం చేసి ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. త్వరలో ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో పట్టణాల్లోనూ వార్డుల విభజన చేపట్టడంతో ఆ తర్వాత ఓటరు జాబితా పూర్తికానుంది. అనంతరం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరగనున్నాయి.