Andhra PradeshHome Page Slider

నిర్బంధాలతో ఉద్యమాన్ని అణగదొక్కలేరు-UTF

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవించాలని, పోలీసులను ప్రయోగించినంత మాత్రాన తమ ఉద్యమం ఆగదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

గుంటూరు: భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవించాలని, పోలీసులను ప్రయోగించినంత మాత్రాన తమ ఉద్యమం ఆగదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీపీఎస్ రద్దుచేసి పాత పింఛను విధానం అమలు చేయాలంటూ కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ చేపట్టిన నిరవధిక దీక్షను పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం భగ్నం చేశారు. నగరంపాలెం సీఐ హైమారావు నేతృత్వంలో పోలీసులు శిబిరం వద్దకు చేరుకొని సమాఖ్య నాయకులను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేని జీపీఎస్‌ను ప్రభుత్వం అమలు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతకుముందు సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థలకు తొత్తులుగా మారాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంఘం, జీవిత బీమా ఉద్యోగుల సంఘం నాయకులు దీక్షాశిబిరం వద్దకు వచ్చి తమ మద్దతు తెలిపారు.