మోదీ, జెలెన్‌స్కీ భేటి-యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు
జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 సదస్సులో భారత ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కలుసుకున్నారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చలు జరిగాయి. రష్యా, ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత భారత్, ఉక్రెయిన్‌లు కలుసుకోవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రష్యా,ఉక్రెయిన్ యుద్ధాన్ని తాను రాజకీయ, ఆర్థిక సమస్యగా కాకుండా మానవత్వానికి సంబంధించిన సమస్యగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. యుద్దం అనేది ఎప్పుడూ వినాశనాన్నే కోరుతుందని, ప్రాణాలను హరిస్తుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ పౌరుల వేదనను తాను అర్థం చేసుకోగలను అని, ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం తరపునా, తాను వ్యక్తిగతంగా కూడా సాధ్యమైనంత కృషి చేస్తానని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుండి వచ్చిన భారత విద్యార్థులు అక్కడి పరిస్థితులను వివరించారన్నారు. గతంలో కూడా యుద్ధంపై వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ భారత్ తరపున గతంలో కూడా స్పష్టం చేశారు.