మోదీ కరెక్ట్… ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్
ఇది యుద్ధానికి సరైన సమయం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యూనియేల్ మాక్రాన్. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఐక్యరాజ్యసమితి వేదికగా సందేశం పంపించారు మాక్రాన్. న్యూయార్క్ లోని యునైటెడ్ నేషన్స్ 77వ జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన మాక్రాన్ ఈ సందర్భంగా మోదీని అభినందించారు. నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన ఆయన… ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదని… ఒకరిపై ఒకరు పగలు, ప్రతీకారాలు తీర్చుకునే సమయం కాదన్నారు. అందరి సార్వభౌమత్వాన్ని అందరూ పరిరక్షించుకోవాలన్నారు. ప్రపంచం ముందున్న సవాళ్లను అందరం కలసికట్టుగా అధిగమించాలన్నారు.

ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనేజేషన్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌తో ప్రత్యక్షంగా సమావేశమైన మోదీ యుద్ధం ఈ కాలానికి తగినది కాదని అభిప్రాయపడ్డారు. శాంతితో అందరం జీవించాలని… రష్యా-ఇండియా దశాబ్దాలుగా ఇదే సందేశాన్ని ప్రపంచానికి ఇస్తోందన్నారు మోదీ.
రష్యా అధ్యక్షుడి పుతిన్ తో ఎన్నోసార్లు ఫోన్ చర్చలు జరిపానన్న మోదీ… ఎప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తపించేవారమన్నారు. ఆహారం, చమురు, భద్రత, ఎరువుల కొరత గురించి చర్చించుకునేవారమన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సేఫ్‌గా ఇండియాకు పంపించినందుకు ప్రధాని రెండు దేశాలకు ధన్యవాదాలు తెలియజేశారు. మోదీ వ్యాఖ్యలకు స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్… మొత్తం వ్యవహారంలో భారత్ పరిస్థితి తెలుసునని… త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని భరోసా ఇచ్చారు. చర్చలకు రష్యా సిద్ధంగా ఉన్నా ఉక్రెయిన్ అందుకు సానుకూలంగా లేదన్న వర్షన్ విన్పించారు పుతిన్.

లక్ష్యాలను చేరుకుంటామంటూ ఉక్రెయిన్ అతి చేస్తోందని… యుద్ధభూమిలో చివరకు మిగిలేదేంటో తెలిసి కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని పుతిన్ చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా విమర్శల నేపథ్యంలో పుతిన్ ఉక్రెయిన్ వ్యవహారంలో కొంత మేర మెత్తబడినట్టుగా కన్పిస్తోంది. ఇండియా-రష్యా మధ్య సంబంధాలు రోజు రోజుకు బలపడుతున్నాయని… వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఇరు దేశాలకు మేలు జరుగుతుందన్నారు పుతిన్.