Telangana

హైకోర్టుకు ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం

నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం హైకోర్టుకు చేరింది. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిందంటున్న బేరసారాలపై తెలంగాణ పోలీసులు చేస్తున్న విచారణపై తమకు నమ్మకం లేదని.. ఈ కేసును స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీంతో విచారణ జరిపించాలని ఆదేశించాలంటూ హైకోర్టులో బీజేపీ నాయకులు పిటిషన్‌ వేశారు. లేదంటే సీబీఐ, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌, పోలీసు కమిషనర్‌ సహా 8 మంది ప్రతివాదులను చేర్చారు. వీళ్లందరికీ నోటీసులు పంపాలని కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించారో లేదో హైకోర్టు రిజిస్ట్రార్‌ తెలపాల్సి ఉంది. ఫాంహౌస్‌లో పట్టుబడిన ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఈ బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విచారణ పూర్తయిన తర్వాత వారిని కోర్టులో హాజరు పరుస్తారు.