మోటర్లకు మీటర్లు పెట్టలేదని కేంద్రం నిధులు ఆపింది: హరీష్‌రావు
కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా తెలంగాణా రాష్ట్రానికి నిధులు అమలు చేసే విషయంలో మొండిచేయి చూపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణా ప్రభుత్వం కేంద్రంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ రోజు సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరిష్‌రావు కేంద్రంపై ధ్వజమెత్తారు. తెలంగాణా రాష్ట్రానికి అందాల్సిన నిధులను కూడా కేంద్రం ఆపేస్తుందని మంత్రి హరీష్‌రావు కేంద్రంపై మండిపడ్డారు. కాగా రాష్ట్రంలో మోటర్లకు మీటర్లు పెట్టలేదని కేంద్రం తెలంగాణాకు రావాల్సిన రూ.30వేల కోట్లను నిలిపివేసిందన్నారు. అయితే పక్క రాష్ట్రం ఏపీ మోటర్లకు మీటర్ల పెట్టి కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకుందని హరీష్‌రావు తెలిపారు. మరోవైపు తెలంగాణాలో వ్యవసాయానికి కరెంట్ సరిపోవడం లేదన్నారు. దీని కోసం నెలకు రూ.1500 కోట్లు చెల్లించి తీసుకుంటున్నామన్నారు. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలు తమకు సమానం అనే కేంద్రం మరి తెలంగాణా పట్ల ఎందుకు అన్యాయంగా వ్యవహరిస్తుందో అర్థం కావట్లేదని మంత్రి హరీష్‌రావు వాపోయారు.