International

తల్లిపాలల్లో కూడా మైక్రో ప్లాస్టిక్ ఆనవాళ్లు

నవజాత శిశువుకు పోషకాలను, రోగనిరోధకశక్తిని అందించే తల్లిపాలు సురక్షితమేనా? ఇటీవల తల్లిపాలలో మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించింది ఇటాలియన్ పరిశోధక బృందం. దీనితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు శాస్త్రవేత్తలు. కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన 34 ఏళ్ల తల్లిపై పరీక్షలు నిర్వహించగా ఆమె పాలల్లో ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. దీనితో పరిశోధకులు ఈ పాలు శిశువు ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపిస్తాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకు ముందుకూడా 5 మిల్లి మీటర్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ కణాలను మానవకణ తంతుల్లోనూ, జంతువుల్లోనూ, సముద్రజీవుల్లోనూ గుర్తించారు.

గర్భిణీస్త్రీలు గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే ప్లాస్టిక్ కవర్లలో, ప్లేట్లలో తీసుకునే ఆహారంలో కూడా ప్లాస్టిక్ కణాలు చేరే అవకాశం ఉంది. అలాగే సీఫుడ్ తీసుకునేటప్పుడు, జంతు ఆధారిత ఆహారం తీసుకునేటప్పుడు, పాలు తీసుకునేటప్పుడు కూడా మెలకువతో ఉండాలి. అలాగే పిల్లలకు కూడా పాలబాటిల్‌ను అలవాటు చేయడం మంచిది కాదని, వీటివల్ల ప్లాస్టిక్ వారి నోటిలోకి డైరెక్ట్‌గా చేరుకునే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.

ఇంకా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ప్లాస్టిక్‌తో ప్యాక్ చేసే ఆహారం, పానీయాలు, సౌందర్య ఉత్పత్తులు, టూత్ పేస్ట్‌లు, సింథటిక్ ఫ్యాబ్రిక్‌తో చేసే దుస్తులు కూడా వాడకుండా ఉండాలని గర్భిణీ స్త్రీలకు శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మానవుల కార్యకలాపాల కారణంగానే జంతువుల శరీరాల్లో ప్లాస్టిక్ కణాలు చేరుతున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కాలుష్యాన్ని నియంత్రించేలా చట్టాలను ప్రజలు, రాజకీయ నాయకులు ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉన్నందువల్ల తల్లిపాల ప్రయోజనాలను మాత్రమే ప్రజలకు వివరించాలని, శిశువులు ప్లాస్టిక్ బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని అభిప్రాయపడ్డారు.