జింబాబ్వేను వణికిస్తున్న “మిజిల్స్”… 700 మంది చిన్నారులు మృతి
జింబాబ్వేలో మీజిల్స్ వ్యాధి విజృంభిస్తోంది. ఏప్రిల్‌లో ఈ వ్యాధిని గుర్తించగా ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 1న ఒక్క రోజే 37మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 6,291 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే రెండు వారాల క్రితం మీజిల్స్ వల్ల 157మంది చిన్నారులు మరణించినట్లు అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 698కి చేరింది.

మీజిల్స్ వ్యాధి బాధితుల్లో ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకోని, పోషకాహార లోపం ఉన్న చిన్నారులే ఉంటున్నారు. మత విశ్వాసాల వలన చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించకపోవడమూ ఈ పరిస్థితికి కారణం. ఈ నేపథ్యంలో దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ తప్పనిసరి చేసేలా కొత్త చట్టం తీసుకురావాలని జింబాబ్వే ప్రభుత్వం భావిస్తోంది. 6 నెలల నుంచి 15ఏళ్ల పిల్లలకు పెద్దఎత్తున మాస్ వ్యాక్సినేషన్, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.