శ్రీలంక నూతన అధ్యక్షునిగా మార్కిస్టు నేత
శ్రీలంక నూతన అధ్యక్షునిగా మార్కిస్టు నేత అనురా కుమార్ దిసనాయకే ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన నేడు రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 9వ శ్రీలంక అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గత ఎన్నికలలో ఆయన కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. అయితే ఈ సారి అనూహ్య రీతిలో అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం నినాదంతో ప్రజల నమ్మకాన్ని సాధించారు. గత పాలకుల అవినీతి, వైఫల్యాలను ఎత్తిచూపుతూ మార్పు, జవాబుదారీతనం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. దీనితో 42.31 శాతం ఓట్లతో ప్రత్యర్థి సాజిత్ ప్రేమదాస సమగి జన బలవేగయ పై విజయం సాధించారు. ఈసారి అధ్యక్ష ఎన్నికలలో త్రిముఖపోరు జరిగింది. దీనితో మొదట ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో విజయానికి అవసరమైన 50శాతం ఓట్లు ఎవ్వరికీ రాలేదు. రెండవ ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ చేపట్టాక కుమార దిసనాయకే విజయం సాధించారు. ఇలా జరగడం దేశచరిత్రలో ఇదే మొదటిసారి. ఆయన 1987లో మార్కిస్టు జనతా విముక్తి పెరమున(జీవీపీ)లో చేరారు. 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్‌పీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. గతంలో చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.