వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు-భవిష్యవాణి పలుకులు
తెలంగాణ సంప్రదాయ పండుగ బోనాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆషాడమాస బోనాలు ప్రతి ఆదివారం ఆడపడుచులందరూ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా రంగం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి మాటగా భక్తుల పూజలు సంతోషంగా అందుకుంటున్నానని, వారికి ఏకష్టం లేకుండా చూసుకుంటానని తెలిపారు. గత సంవత్సరం ప్రజలు ఇచ్చిన వాగ్దానం మరిచి పోయారన్నారు. మీకు కావల్సిన బలాన్నిస్తానని, ఆలస్యమైనా వర్షాలు వస్తాయని, అగ్నిప్రమాదాలు పెరుగుతున్నాయని, జాగ్రత్త వహించాలని కోరారు. భయపడవద్దని, తనను నమ్మినవారిని కాపాడతానని మాట ఇచ్చారు. అలాగే ఐదు వారాలు తప్పకుండా నైవేద్యాలు సమర్పించాలని, భక్తిగా ఏపూజలు చేసినా స్వీకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తలసాని యాదవ్ పాల్గొన్నారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.