NewsTelangana

నేడే చంద్ర గ్రహణం.. జాగ్రత్తలు తప్పనిసరి

ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం మంగళవారం (నవంబరు 8వ తేదీన) సంభవించనుంది. సాయంత్రం 5 గంటల 32 నిమిషాలకు ప్రారంభమయ్యే చంద్ర గ్రహణం సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు ముగుస్తుంది. సూర్యుడు, చంద్రుడి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్య కాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. దీన్నే సంపూర్ణ చంద్ర గ్రహణం అంటారు. ఈ చంద్ర గ్రహణం భారత్‌లోని పలు నగరాలతో పాటు ఇతర దేశాల్లోనూ కనిపిస్తుంది. చంద్ర గ్రహణం దశ వ్యవధి ఒక గంట 24 నిమిషాల 28 సెకన్ల పాటు ఉంటుంది. పాక్షిక దశ వ్యవధి 3 గంటల 38 నిమిషాల 35 సెకన్ల పాటు ఉంటుంది. భారత్‌లో సూతక కాలం గ్రహణానికి 9గంటల ముందు ప్రారంభం అవుతుంది.

హైదరాబాద్‌లో సాయంత్రం 5.40కు ప్రారంభం..

భారత్‌లో ఢిల్లీ, లక్నో, హైదరాబాద్‌, కొలకత్తా, పాట్నా నగరాల్లో చంద్ర గ్రహణం కనిపిస్తుంది. పాట్నా, రాంచీ, కోల్‌కతా, గౌహతి, సిలిగురి, ఇతర తూర్పు నగరాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపిస్తుంది. ఢిల్లీ, ఇతర ఉత్తర నగరాల్లో పాక్షిక గ్రహణం కనిపిస్తుంది. ఖాట్మండు, టోక్కో, మనీలా, జకార్తా, మెల్‌బోర్న్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్‌ డీసీ, బీజింగ్‌, సిడ్నీ, న్యూయార్క్‌, లాస్‌ ఏంజిల్స్‌, చికాగో, మెక్సికో తదితర ప్రపంచ నగరాల్లోనూ సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో 5 గంటల 40 నిమిషాలకు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.

గర్భిణీలూ.. ఇవీ జాగ్రత్తలు

ఖగోళంలో జరిగే మార్పులు, గ్రహాల కదలికలు, గ్రహణాలు మానవుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పండితులు నమ్ముతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై నెగెటివ్‌ ప్రభావం చూపుతుందని.. వారి పిల్లలపై గ్రహణ ప్రభావం పడకుండా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. గ్రహణ సమయంలో గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తీసుకోకూడదు. అవసరమైతే పండ్లు తినొచ్చు. కత్తి వంటి పదునైన, లోహ వస్తువులకు గర్భిణీలు దూరంగా ఉండాలి. ఏ వస్తువునూ కట్‌ చేయకూడదు. గ్రహణ సమయంలో వ్యాయామం చేయరాదు. స్నానం కూడా చేయకూడదు. ఇంట్లోనే ఉండి మనసును తేలికగా ఉంచుకోవడం, పడుకోవడం వంటివి చేస్తూ గ్రహణం విడిచిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి.

గ్రహణ సూతక కాలం మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సమయాన్ని అశుభ కాలంగా భావిస్తారు. పిల్లలు, వృద్దులు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లు ఈ సూతక కాలంలో ఆహారం తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఆకలి ఎక్కువగా ఉంటే ముందే తులసి ఆకులు వేసి ఉంచిన ఆహారం భుజించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గ్రహణ దోషం నుంచి బయట పడొచ్చని పండితులు చెబుతున్నారు.