NewsTelangana

మద్యంలో మునిగిన మునుగోడు

ఉప ఎన్నికల కారణంగా మునుగోడు ప్రజలు మద్యంలో మునిగి తేలుతున్నారు. నియోజక వర్గంలో ఎక్కడ చూసినా సాయంత్రం సిట్టింగ్‌లు, దావత్‌లు మామూలై పోయాయి. తిన్నోళ్లకు తిన్నంత.. తాగినోళ్లకు తాగినంత అన్న చందంగా యువకులు, మందుబాబులు రోడ్లపైనే తూలి పడిపోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి రోజూ మద్యం సరఫరా చేస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వివిధ పార్టీల నాయకులు తంటాలు పడుతున్నారు. మద్యాన్ని ఏరులై పారిస్తూ ఓట్లను దక్కించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు.

మునుగోడులోనే రూ.200 కోట్ల మద్యం విక్రయాలు..

ఎక్సైజ్‌ అధికారుల లెక్కల ప్రకారం ఈ నెల 22వ తేదీ వరకు మునుగోడులో రూ.160.8 కోట్ల మద్యం అమ్ముడైంది. ఎన్నికలకు ఇంకా వారం రోజులే సమయం ఉండటంతో ఈ విక్రయాలు రూ.200 కోట్లు దాటి పోయే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం విక్రయాలు అత్యధికంగా మునుగోడు మండలంలో.. అత్యల్పంగా గట్టుప్పల్‌ మండలంలో జరిగినట్లు సమాచారం. నల్లగొండ జిల్లాలో ప్రతి నెల రూ.132 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయి. కానీ ఉప ఎన్నికల కారణంగా ఈ నెలలో మునుగోడు నియోజక వర్గంలోనే రూ.200 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరుగుతాయని తెలుస్తోంది.

హైదరాబాద్‌లోనూ మునుగోడు సభలు..

టీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రతి ఓటును కీలకంగా భావిస్తుండటంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న మునుగోడు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విందుల కోసం రూ.300 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోది. మటన్‌, చికెన్‌ కోసం మరో రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.